
పేదల వైద్యం.. ప్రైవేటు పరం
పెనుకొండ: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడం..వైద్య విద్యనభ్యసించే విద్యార్థులకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి తెచ్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే 2021 అక్టోబర్ 31న అప్పటి సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్ధతిలో పెనుకొండ మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు. దీంతో ఈ ప్రాంత వాసులంతా ఎంతో సంతోషించారు. మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కావడంపై హర్షించారు. పెనుకొండకు ప్రత్యేక గుర్తింపుతో పాటు పేదలకు మేలు జరుగుతుందని సంబరపడ్డారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తుండడంపై ఆవేదనకు గురవుతున్నారు.
వడివడిగా పనులు..
పెనుకొండ మెడికల్ కళాశాలకు వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 475 కోట్లు మంజూరయ్యాయి. మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్ ఆస్పత్రి నిర్మాణానికి గత ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఎమ్మెల్యే శంకరనారాయణ అధికారులను పరుగులు పెట్టించి పనులు వేగవంతం చేశారు. కానీ కళాశాల ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో బండరాళ్లు ఉండటంతో వాటిని బ్లాస్టింగ్ చేస్తూ పనులు చేపట్టారు. ఈ క్రమంలో పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భవనాలకు పిల్లర్లను నిర్మించడమే కాక కొన్ని భవనాలకు పైకప్పు పనులు సైతం పూర్తి చేశారు. అప్పటి ఎమ్మెల్యే శంకరనారాయణ, ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్, కలెక్టర్, ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి పనులు ముందుకు సాగేలా చూశారు.
కూటమి రాకతో ఆశలు ఆవిరి..
కూటమి ప్రభుత్వం వచ్చాక పెనుకొండ మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థను ఇక్కడి నుంచి పాలకులు సాగనంపారు. ఇక కొత్త కాంట్రాక్ట్ సంస్థకు ఇస్తారని ప్రజలు భావించినా... అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు అప్పగిస్తూ కేబినెట్‌లో తీర్మానించడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉచిత వైద్యం అందుతుందనుకుంటే ముక్కు పిండి వసూలు చేసే ప్రైవేటు విధానం అమల్లోకి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా రూ.వందల కోట్ల విలువైన వైద్య కళాశాల భూమిని ఎకరా ఏడాదికి కేవలం రూ.100తో లీజుకు ఇవ్వడంపై మండిపడుతున్నారు. కూటమి సర్కార్ చర్యల వల్ల ఈప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందకపోగా, ఈ ప్రాంత యువత వైద్యవిద్యకూ అడ్డంకులు ఎదురవుతాయంటున్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ తన నిర్ణయాన్ని విరమించుకుని పెనుకొండ కళాశాలను పూర్తి చేసి ఈప్రాంత పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా చూడాలని కోరుతున్నారు.
పెనుకొండ మెడికల్ కళాశాలపై
కాల ‘కూటమి’ విషం
పీపీపీ పేరుతో ప్రైవేటుకు
అప్పగించేందుకు రంగం సిద్ధం
కరువు ప్రజలకు కార్పొరేట్
ఉచిత వైద్యం ఇక కలే
ఎకరా రూ.2 కోట్ల విలువైన భూమిని ఏడాదికి రూ.100తో లీజు