
వెంటాడుతున్న యూరియా కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. బస్తా, రెండు బస్తాల యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఉదయం ఏడింటికే ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, ప్రైవేట్ దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. మండుటెండలో నిలబడ లేక వరుసల్లో చెప్పులు, బ్యాగులు, టవాళ్లు పెట్టి గంటల కొద్దీ వేచి చూస్తున్న దుస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం జిల్లాకు చేరుకున్న బుధవారం కూడా చాలా ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు తిప్పలు పడటం కనిపించింది.
ఒక్క బస్తా కూడా లేదు..
వారం రోజులుగా మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు సూపర్ హిట్ సభ కోసం జిల్లా కేంద్రంలో మకాం వేసినా రైతులు పడుతున్న కష్టాలపై ఒక్కరు కూడా స్పందించలేదు. వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలితంగా అంతో ఇంతో యూరియా సరఫరా అవుతోంది. అది కూడా కంటి తుడుపుగా సరఫరా చేస్తూ రైతులందరికీ యూరియా దక్క కుండా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 436 ఆర్‌ఎస్‌కేలు, మూడు డీసీఎంఎస్‌లు, 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), రెండు ఎఫ్‌పీఓలు, మూడు ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లు, 460 రీటైల్ దుకాణాల్లో యూరియా నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. అధికార పార్టీ నేతల కోసం బఫర్‌స్టాక్ కింద మాత్రం 500 మెట్రిక్ టన్నులు పెట్టుకున్నారు. ఇటీవల మూడు కంపెనీల నుంచి వచ్చిన అరకొర యూరియా వచ్చింది వచ్చినట్లే ఖాళీ అవుతుండటంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో 30 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ చేశామని చెబుతున్నా కచ్చితమైన లెక్కలు మాత్రం చూపడం లేదు. ఈ క్రమంలోనే యూరియా ఎక్కువగా వాడొద్దంటూ ఉచిత సలహాలిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది యూరియా వాడకంపై నేడు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నగరంలో వందలాది దుకాణాలు ఉన్నా ఎక్కడా ఒక బస్తా యూరియా లభించే పరిస్థితి లేదు.
బ్లాక్‌మార్కెట్‌కు తరలించడంతోనే..
ఆగస్టులో వర్షాలు పడడంతో వరి నాట్లు పెరిగాయి. ఇప్పటికే 20 వేల హెక్టార్లలో వరి సాగులో ఉంది. ప్రస్తుతం నాట్లు కుదురుకోవాలంటే తప్పనిసరిగా యూరియా అవసరం ఉండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. అలాగే మొక్కజొన్న 22 వేల హెక్టార్లు, అరటి 10 వేల హెక్టార్లు, వేరుశనగ 79 వేల హెక్టార్లు, కంది 94 వేల హెక్టార్లు, ఆముదం 15 వేల హెక్టార్లలో సాగు చేసిన అన్ని పంటలకు అంతో ఇంతో యూరియా వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున రైతుకు ఇబ్బందిగా మారింది. జిల్లాకు చేరిన యూరియాను చాలా వరకు బ్లాక్‌మార్కెట్‌కు తరలించడంతోనే దుస్థితి తలెత్తిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2019–2024 మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పంటలు సాగులోకి వచ్చినా ఎన్నడూ ఎక్కడా యూరియా సమస్య ఎదురుకాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
అనంతపురంలో ఎక్కడా
ఒక్క బస్తా కూడా దొరకని వైనం
ఉచిత సలహాలు ఇస్తుండటంపై అన్నదాతల మండిపాటు