
మాయ చేయడం బాబుకు కొత్తేమీ కాదు
● మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం: జనాలను మాయ చేయడం సీఎం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ సూపర్ మోసం సభను నిర్వహించారంటూ వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య విమర్శించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాటు పథకాలు ఎగ్గొట్టి అన్ని పథకాలు ఇచ్చామంటూ మోస చేశారన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో మొదటి పథకమైన ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ హామీ ఇప్పటి వరకూ నెరవేర్చలేదన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తరలించుకెళ్లడంపై ఉన్న శ్రద్ధ, జీడిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న బీటీపీకి నీళ్లిచ్చే విషయంలో ఏమైందని ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు కల్పతరువుగా ఉన్న ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారని నిలదీశారు. ప్రజలను మాయ చేసేందుకే సభల పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటన్నారు.
పాముకాటుతో
యువకుడి మృతి
● పైళ్లెన నాలుగు నెలలకే విషాదం
బొమ్మనహాళ్: పాముకాటుతో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలంలోని లింగదహాళ్ గ్రామానికి చెందిన కృష్ణమ్మ, తిప్పేస్వామి దంపతుల కుమారుడు రంజిత్ (22)కు నాలుగు నెలల క్రితం కర్ణాటకలోని కమ్మరచేడు గ్రామానికి చెందిన మహాలక్ష్మితో వివాహమైంది. దానిమ్మ చెట్ల కటింగ్‌తో జీవనం కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం అనంతపురం సమీపంలోని ఓ తోటలో దానిమ్మ చెట్ల కటింగ్ చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స అనంతరం స్వగ్రామానికి వచ్చిన తర్వాత నాటు వైద్యం చేయించుకున్నాడు. మంగళవారం పరిస్ధితి విషమించడంతో బళ్లారిలోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.