
నెట్టికంటుడి సన్నిధిలో అక్రమాలు
గుంతకల్లు: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కొన్నేళ్లుగా చాపకింద నీరులా సాగుతూ వచ్చిన ఈ కుంభకోణం విలువ రూ.కోట్లలోనే ఉండడం గమనార్హం.
చిరుద్యోగుల కష్టార్జితంపై కన్ను
నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలోని వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించేందుకు 71 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరంతా ప్రస్తుతం విజయవాడ కనకదుర్గ ఏజెన్సీ కింద పని చేస్తున్నారు. దేవాలయంలో సెక్యూరిటీ, క్యూలైన్లు, వంటశాల తదితర విభాగాల్లో పనిచేస్తున్న వీరికి దేవస్థానం నిధుల నుంచి వేతనాలు మంజూరవుతాయి. ఒక్కొక్కరికి నెలకు రూ.20వేలు చొప్పున జీతం నిర్ణయించారు. ఇందులో పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ కింద రూ.6,600 మినహాయించుకుని నెలకు రూ.13,400 నికర జీతంగా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఈ 71 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ పేరిట నెలకు రూ.4.68 లక్షలు చొప్పున ఏటా అరకోటికి పైగా కట్ చేసి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ పద్దతిలో మరో 40 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరి జీతాల్లోనూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ కట్ చేసి, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు కుంభకోణానికి ఆలయ అధికారులు తెరలేపారు. 71 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకూ పీఎఫ్ ఖాతా, ఈఎస్‌ఐ కార్డులు లేవు. తమ జీతం నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ కింద కట్ చేస్తున్న మొత్తాన్ని ఉద్యోగులకు తెలియకుండా తొక్కిపెట్టారు. ఈ మొత్తాన్ని ఆలయ అధికారులే స్వాహా చేస్తూ వచ్చారు.
ఆడిట్‌లో గుర్తింపు..
నాలుగు రోజుల క్రితం కసాపురం ఆలయ జమ ఖర్చుల ఆడిట్ జరిగింది. పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన మొత్తం ఎక్కడ జమ అయిందో అర్ధం కాక ఆడిటర్లు తలలు బాదుకున్నా అంతు చిక్కలేదు. దీంతో ఇదే విషయంపై ప్రశ్నించడంతో ఆడిటర్లను ఆలయ అధికారులు బెదిరించినట్లు సమాచారం. చూసీచూడనట్లుగా వెళ్లాలని, లోతులోకి వెళితే ఇబ్బంది పడతారంటూ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో తమ పని తాము చేసుకుంటామని ఆడిట్ అధికారులు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, మూడు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాకపోకడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. అసలే వచ్చే అరకొర జీతంలో కోతలు పెడుతుండటంతో భారంగా నెట్టుకొస్తున్నట్లు వాపోతున్నారు. ప్రతి నెలా 10వ తేదీకి జీతం వచ్చేదని, ఈ నెల 10తో మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ జీతం వేయలేదని చిరుద్యోగులు వాపోతున్నారు.
కాంట్రాక్టర్ చేతల్లోనే ఉంటుంది
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ కట్ చేసే అంశం కాంట్రాక్టర్ చేతల్లోనే ఉంటుంది. ఈ విషయమై కాంట్రాక్టర్‌ను పిలిపించి మందలించాం. గత ఏడాది ఈఎస్‌ఐ, పీఎఫ్ చేయించాం. అంతేకాక నోటీస్ ఇచ్చి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు కట్టించాం. ఆడిట్ ఉద్యోగులు కొత్తగా వచ్చారు. వారికి ఇక్కడ పరిస్థితి, పాస్‌వర్డులు తెలియక జీతాలు వెనక్కు పంపుతున్నారు.
– వాణి, ఆలయ ఈఓ,
కసాపురం దేవస్థానం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ నిధుల మళ్లింపు
ఖాతాలకు జమ చేయకుండా స్వాహా చేసిన ఆలయ అధికారులు
ఏళ్లుగా సాగుతున్న దందా విలువ రూ.కోట్లలోనే