
ఉద్యోగాల కల్పనే లక్ష్యం
● అధికారులకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగం చేపట్టనున్న జాబ్‌మేళాలపై విస్తృత ప్రచారం కల్పించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం జరిగిన జిల్లా నైపుణ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి ఎనిమిది జాబ్ మేళాలను ఏర్పాటు చేసి ప్రైవేటు, అవుట్ సోర్సింగ్ లేదా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధి కల్పనాధికారిని ఆదేశించారు. ఈ నెల 18న కళ్యాణదుర్గం నియోజకవర్గం, 28న రాప్తాడు, ఆగస్టు 1న అనంతపురం అర్బన్, 16న గుంతకల్లు, 29న రాయదుర్గం, సెప్టెంబరు 12న శింగనమల, 19న తాడిపత్రి, 27న ఉవరకొండ నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నెలా ప్లేస్‌మెంట్ నివేదిక అందించాలన్నారు. ఆగస్టు నాటికి డిగ్రీ కళాశాలల్లో స్కిల్ హబ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శైలజ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముకుద, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, రూడ్‌సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జేఎన్‌టీయూ టీపీఓ శ్రీనివాసులు, ఎస్‌కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణుడు, జేడీఎం సూర్యనారాయణ, మెప్మా డీవైఎస్‌ఓ పద్మావతి, అధికారులు పాల్గొన్నారు.
బ్యాంక్ ఖాతా ఉంటేనే ‘తల్లికి వందనం’
అనంతపురం రూరల్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా ఉంటేనే తల్లికి వందనం పథకం నగదు జమ అవుతుందని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇన్‌ఛార్జ్) రామాంజినేయులు తెలిపారు. మంగళవారం బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సహాయ సంక్షేమశాఖ అధికారులు, హస్టల్ వార్డెన్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. త్వరలో రెండో విడత తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ విషయాన్ని వార్డెన్లు, సహాయ సంక్షేమశాఖ అధికారులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంక్, లేదా పోస్టల్ ఖాతా చేయించి ఎన్‌పీసీఐ లింక్ చేయించాలన్నారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యం