
కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
పుట్లూరు: ఏడాది కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఆయన పుట్లూరులో నిర్వహించిన ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌వస్తే చంద్రబాబు అండ్ కోకు చెమటలు పట్టి వేలాది మంది పోలీసులతో పర్యటనకు అడ్డంకులు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’,‘బీసీలకు 50 ఏళ్లకే పింఛన్’, జాబ్ కేలండర్ అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన బాబు.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అమలు చేయలేదన్నారు. గత జగనన్న పాలన, ప్రస్తుత కూటమి పాలన తీరుపై చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే దాడులు చేస్తూ, పోలీసు కేసులు పెడుతూ రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యాన్ని సరసమైన ధరలకే అందిస్తామని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం, ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. చంద్రబాబు దగా పాలనను ఇంటింటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వనీర్ పి.మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పిదప సువర్ణ, భాస్కర్, ఎంపీటీసీ సభ్యుడు భూమిరెడ్డి నాగార్జునరెడ్డి, నాయకులు మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, జయరాంరెడ్డి, శివారెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణస్వామి, రామాంజులరెడ్డి, రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.
‘సూపర్ సిక్స్’ను గాలికి
వదిలేసిన సీఎం చంద్రబాబు
మద్యాన్ని సరసమైన ధరలకు
ఇస్తానని చెప్పిన ఘనత ఆయనదే
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం