
సుడి‘గండం’లో ఏరువాక
అనంతపురం అగ్రికల్చర్: వరుణదేవా... నీ జాడెక్కడ అంటూ ‘అనంత’ అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. ఖరీఫ్ ఆరంభమై 40 రోజులవుతున్నా పదును వర్షం పడకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంటలు విత్తుకునేందుకు కీలక సమయం దగ్గర పడుతున్న కొద్దీ రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనెల 15 వరకు పంటలు విత్తుకునేందుకు మంచి అదనుగా చెబుతున్నారు. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా నెలాఖరు వరకు ఇబ్బంది లేదని శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటించారు. కానీ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే తేలికపాటికే పరిమితమవుతున్నాయి. ఒక్క మంచి వర్షం కూడా నమోదు కాలేదు. సీజన్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ ఏరువాక మందగించిపోయింది.
రెండే రెండు రోజులు..
ఆశల నైరుతి ఈ సారి మే 26న ప్రవేశించడంతో అన్నదాత హర్షాతిరేకం వ్యక్తం చేశారు. రుతుపవనాల ప్రవేశానికి ముందు మంచి వర్షాలు నమోదయ్యాయి. నైరుతి వచ్చాక వర్షాలు ఆగిపోయాయి. జూన్ 8, 11 తేదీల్లో మాత్రమే మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత నెల రోజులు కావస్తున్నా మంచి పదను వర్షం పడలేదు. జూన్ 1 నుంచి నేటి వరకు 40 రోజులకు గానూ కేవలం రెండంటే రెండే రోజులు వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం. దాదాపు 20 మండలాల్లో 30 రోజులు సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదు కావడం వర్షాభావ తీవ్రతకు అద్ధం పడుతోంది. జూన్‌లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. కీలకమైన జూలై అయితే మరీ ధారుణంగా ఈ పది రోజుల్లో కేవలం 5.9 మి.మీ వర్షం కురిసింది. ఓవరాల్‌గా చూస్తే... ఈ సీజన్‌లో 76.7 మి.మీ గానూ 30 శాతం తక్కువగా 53.8 మి.మీ వర్షం కురిసింది.
30 మండలాల్లో వర్షాభావం:
శెట్టూరు మండలంలో మాత్రమే ఈనెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన 30 మండలాల్లో సాధారణం కన్నా చాలా తక్కువగానూ, అందులో రాప్తాడు మండలంలో కనీసం తేలికపాటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. దీంతో ఖరీఫ్ ఏరువాక మందకొడిగా ‘సాగు’తోంది. జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 3.40 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 15 శాతంతో 50 వేల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో వేరుశనగ 15 వేల హెక్టార్లు, కంది 12 వేల హెక్టార్లు, పత్తి 7,500 హెక్టార్లు, మొక్కజొన్న 5 వేల హెక్టార్లు, ఆముదం 3,500 హెక్టార్లు... ఇలా చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అదను దాటిపోతుందనే ఆందోళనతో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలకు అరతేమలోనే పంటలు వేస్తున్న పరిస్థితి నెలకొంది. పంటలు విత్తుకునేందుకు ఆరుద్రతో పాటు పునర్వసు కార్తెలు మంచి అదనుగా చెబుతున్నారు. ఆరుద్ర ముగిసిపోగా... ప్రస్తుతం పునర్వసు నడుస్తోంది. అది కూడా ఈనెల 20న ముగుస్తుంది. అంతలోపు పంటలు విత్తుకుంటే మంచి పంట దిగుబడులు వస్తాయని రైతుల్లో నమ్మకం ఉన్నా... వర్షం జాడ లేక ఆందోళన నెలకొంది.
వర్షాకాలంలోనూ పెరగని భూగర్భజలం
పేరుకు వర్షాకాలమే అయినా జిల్లాలో అనుకున్న మేరకు భూగర్భజలాలు పెరగ లేదు. జూన్, జూలైలో సాధారణం కన్నా 30 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుతం జిల్లాలో ఉన్న 97 ఫిజోమీటర్ల నుంచి తీసుకున్న గణాంకాల ప్రకారం భూగర్భజలాలు సగటున 11.28 మీటర్లుగా నమోదైంది. 12 మండలాల్లో సగటు కన్నా జలాలు లోతుకు వెళ్లినట్లు గుర్తించారు. ఇందులోనూ యాడికి మండలంలో 25.45 మీటర్లు, శెట్టూరులో 24.87 మీటర్లు, పుట్లూరులో 21.81 మీటర్లుగా నమోదు కావడంతో ఈ మూడింటినీ డేంజర్ జోన్‌లో పెట్టారు. ఇవి కాకుండా కళ్యాణదుర్గం, తాడిపత్రి, డి.హీరేహాళ్, బ్రహ్మసముద్రం, కుందుర్పి, కణేకల్లు, పామిడి, గుమ్మఘట్ట, బెళుగుప్ప మండలాలు నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఈ మండలాల్లో నీటి వాడకం అధికంగా ఉన్నందున క్రిటికల్, సెమీక్రిటికల్ జాబితాలో పెట్టారు.
40 రోజులకు గానూ
రెండే వర్షపు రోజులు
30 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సీజన్ మొదట్లోనే సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదు
15 శాతం సాగుతో
పడకేసిన ఖరీఫ్ ఏరువాక