
బదిలీలు ముగిసినా.. రాయ‘బేరాలు’!
అనంతపురం సిటీ: పీఆర్‌లో బదిలీలు ముగిసినా రాయబేరాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, బదిలీల గడువు ముగిసినా ఆ శాఖలోని ఇద్దరు డీఈలు రాయ‘బేరాలు’ చేస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. కోరుకున్న స్థానాలకు పోస్టింగ్ సర్దుతామంటూ పలువురికి హామీ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. కొందరు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు రేయింబవళ్లూ పీఆర్ సర్కిల్ కార్యాలయం వద్దే పడిగాపులు కాస్తున్నారు.వారితో ‘సాక్షి’ మాట్లాడగా.. కౌన్సెలింగ్‌లో తాము కోరుకున్న చోటు వచ్చినా, రాజకీయ సిఫారసుతో తమకు తెలియకుండానే ఆ స్థానాలు మారిపోతున్నాయని ఆరోపించారు. జెడ్పీ క్యాంపస్ లోని ఈఈ కార్యాలయంలో పని చేసే ఓ డీఈఈతో పాటు మరో డీఈఈ బదిలీల్లో అన్నీ తామై వ్యవహరించారు. అందుకు తగ్గట్టు బాగానే వెనకేసుకున్నట్లు చర్చ సాగుతోంది. అయితే, ప్రక్రియ ముగి సినా పేర్లు తారుమారు చేయిస్తూ.. అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబ్బులు వసూలు చేస్తే చర్యలు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ నాలుగు రోజుల క్రితమే ముగిసింది. ఎస్‌ఈగా పని చేసిన మహమ్మద్ జహీర్ అస్లాం ఉద్యోగ విరమణ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే కొనసాగింది. జాబితా కూడా ఇప్పటికే కలెక్టర్‌కు సమర్పించాం. ఆరోపణల గురించి నాకు తెలియదు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవు.
– ప్రభాకర్‌రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ