వరుణ దేవా.. పంటలు బాగా పండేలా చూడు | - | Sakshi
Sakshi News home page

వరుణ దేవా.. పంటలు బాగా పండేలా చూడు

Jun 12 2025 7:37 AM | Updated on Jun 12 2025 12:20 PM

Collector Prayers for Rains

ఎద్దులు, నాగలి, భూమికి పూజలు నిర్వహించిన కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌

కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌

కూడేరు: ‘వరుణ దేవా కరుణించు. వర్షాలు సమృద్ధిగా కురిపించు. పంటలు బాగా పండేలా చేసి రైతులు ఆర్థికంగా ఎదిగేలా చూడు’ అంటూ కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రార్థించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం కూడేరు మండలం కొర్రకోడులో వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎద్దులు, నాగలి, భూమికి పూజలు నిర్వహించారు. నాగలి పట్టి వేరుశనగ విత్తును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసే అవకాశాలున్నాయన్నారు. జిల్లాలో విత్తన వేరుశనగ పంపిణీ ఇప్పటికే మొదలైందని, రైతులకు విత్తన కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతులు యాజమాన్య పద్ధతుల ద్వారా పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని తెలియజేశారు. చిరుధాన్యాల పంటల సాగుకు ఆసక్తి చూపాలన్నారు. పలువురు రైతులకు మినీ కిట్స్‌, భూసార పరీక్షల కార్డులను అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తిప్పే నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ వెళ్లిన కలెక్టర్‌

అనంతపురం అర్బన్‌: కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ బుధవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటై గురువారానికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు కలెక్టర్‌ విజయవాడ వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి 13న విధులకు హాజరవుతారని తెలిసింది.

‘ఉపాధి’లో 16 రకాల పండ్ల తోటల పెంపకం

అనంతపురం టౌన్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 16 రకాల పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సలీంబాషా తెలిపారు. జిల్లాలో 8,051 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టే విధంగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మామిడి, చీనీ, నిమ్మ, జామ, తైవాన్‌ జామ, సపోట, కొబ్బరి, అల్లనేరేడు, చింత, సీతాఫలం, దానిమ్మ, అంజూరా, యాపిల్‌బేర్‌, అవకాడో, పనస, డ్రాగన్‌ఫ్రూట్‌తో పాటు గులాబీ, మల్లె, మునగ తదితర పంటల సాగు కోసం అనుమతులను మంజూరు చేశారన్నారు. ఐదెకరాల్లోపు మెట్ట భూములున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

జీడిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్లు

బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌తో పాటు పరివాహక ప్రాంతంలోని కోనంపల్లి గ్రామంలో పంటలు, నీటి వినియోగాన్ని ట్రైనీ కలెక్టర్‌లు పరిశీలించారు. ఏపీ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా ట్రైనీ కలెక్టర్‌లు సచిన్‌రహర్‌, నరేంద్ర పాడల్‌, పృథ్వీరాజ్‌కుమార్‌, సందీప్‌ రఘువంశీ, నాగ వెంకటసహిత్‌, పర్హిన్‌ జాహిద్‌, మనీషా బుధవారం జీడిపల్లి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌ స్వాగతించారు. కోనంపల్లి వద్ద బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ పంటకు నీటి వినియోగంపై డ్రిప్‌, స్ప్రింక్లర్ల పనితీరును ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్‌ఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన అంశాలను హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రాజాస్వరూప్‌, ఈఈ శ్రీనివాసులు వివరించారు. కార్యక్రమంలో మండల హార్టికల్చర్‌ అధికారి కృష్ణతేజ, ఎంఐఓ మల్లేష్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Trainee Collectors1
1/1

కోనంపల్లి గ్రామంలో పంటలు, నీటి వినియోగాన్ని ట్రైనీ కలెక్టర్‌లు పరిశీలిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement