అనంతపురం–బెంగళూరు ప్యాసింజర్ రైలు ప్రారంభం
అనంతపురం సిటీ: అనంతపురం–బెంగళూరు మధ్య ప్యాసింజర్ రైలును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సునీత, డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, అహుడా చైర్మన్ టీసీ వరుణ్‌తో కలసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనంతపురం నుంచి బెంగళూరుకు రూ.50కే చేరుకోవచ్చన్నారు. 12 బోగీలుంటాయన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్‌లో వాటరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని డీఆర్‌ఎంకు సూచించారు. మెమూ రైలు సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరేలా చూడాలని ఎమ్మెల్యే సునీత కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గుత్తా కేశవ నాయుడు, సౌత్ సెంట్రల్ రైల్వే డీజీఎం ఉదయ్‌నాథ్, రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఓ శ్రవణ్ కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్‌రెడ్డి, ఏడీఆర్‌ఎం సుధాకర్, అనంతపురం రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘వీర’బాదుడుతో సెంచరీ
అనంతపురం: వైఎస్సార్ జిల్లా కడపలో జరుగుతున్న అండర్–23 అంతర జిల్లా క్రికెట్ టోర్నీలో బుధవారం జరిగిన అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్‌లో అనంత బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి వీరబాదుడుతో బంతిని బౌండరీలు దాటించి 125 పరుగులు సాధించాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు పది వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో లోహిత్ లక్ష్మీ నారాయణ 80 పరుగులు, కె.రెడ్డిరుషీల్ 60 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఓపెనర్ కోగటం హనీష్‌వీరారెడ్డి 125 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మరో బ్యాటర్ పి.అర్జున్ టెండూల్కర్ 27 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో తొలి సెంచరీ సాధించిన కోగటం హనీష్ వీరారెడ్డిని జట్టు సభ్యులు, కోచ్‌లు అభినందించారు.
అనంతపురం–బెంగళూరు ప్యాసింజర్ రైలు ప్రారంభం


