పీఆర్‌లో సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: పంచాయతీరాజ్ (పీఆర్) శాఖకు సంబంధించి అనంతపురంలోని పీఆర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి (రాయలసీమ జిల్లాలు) బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, బాలాజీ (తిరుపతి), చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఆ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) బాలూనాయక్, ఎస్‌ఈ జహీర్ అస్లాం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్‌ఈ మురళి, ఇతర జిల్లాల ఎస్‌ఈలతో పాటు పీఆర్‌ఐ ఈఈ ప్రభాకరరెడ్డి, అనంతపురం సబ్ డివిజన్–1, 2 డీఈఈలు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి, సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఖాజా మొహిద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ బదిలీలనూ ఆమోదించారు.
గాలిమరలు కూల్చేశారు!
పుట్లూరు: మండలంలోని ఎ.కొండాపురం వద్ద కొండలపై ఏర్పాటు చేసిన గాలిమరలు నెల రోజుల వ్యవధిలో రెండు కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ గాలిమరలు కూలిపోలేదని పరికరాల చోరీ కోసం కొందరు దుండగులు సపోర్ట్ దిమ్మెలకు ఉన్న ఇనుప చువ్వలను కత్తిరించి కూల్చేసినట్లు భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధులు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కూల్చి వేసిన గాలిమరల్లోని విలువైన పరికరాలను చోరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
హామీల అమలు కోసం పోరుబాట
● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్
అనంతపురం అర్బన్: అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, హామీల అమలు కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమైనట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విడుదల చేసి, మాట్లాడారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని, సూపర్ సిక్స్ అమలు చేయాలనే డిమాండ్‌తో జూన్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దారు కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు తలపెట్టామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లేలా చేపట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజేష్‌గౌడ్, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా పాల్గొన్నారు.


