
కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదా?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇవి ప్రజల్లో మెదలినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కక్ష సాధింపులు తప్ప.. సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదా? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు దారుణ’మని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాని అరెస్టును ఖండించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో భయానకమైన వాతావరణాన్ని తీసుకువస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదని విమర్శించారు. ఆయన జీవితమంతా అబద్ధాలమయ మని దుయ్యబట్టారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
గిరిజన పాఠశాలల్లో
ప్రవేశాలకు దరఖాస్తులు
అనంతపురం రూరల్: గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామాంజినేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఉన్నాయన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి 3 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు ఆయా పాఠశాలల్లో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
యువ వైద్యుడిని
మింగిన రోడ్డు ప్రమాదం
కోలారు: రోడ్డు ప్రమాదం ఓ యువ వైద్యుడిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కర్ణాటకలోని కోలారు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం నగరానికి చెందిన యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. అనంతపురం నగరంలోని ఇందిరానగర్‌కి చెందిన వెంకటేశులు కుమారుడు కృష్ణ జగన్ (24) చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం హౌస్‌సర్జన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కళాశాలకు కారులో బయలుదేరాడు. కోలారు జిల్లా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో ఉదయం 8.30 గంటల సమయంలో కృష్ణ జగన్ ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా తీవ్ర గాయాలైన డాక్టర్ కృష్ణ జగన్ ఘటనా స్థలంలోనే మరణించారు. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కృష్ణ జగన్ మరణవార్తను తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
యోగాతో మానసికోల్లాసం
తాడిపత్రి రూరల్: యోగాతో మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో సోమవారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పెన్నానది ఒడ్డున గల బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణలో యోగాసనాలు వేయడం సంతోషకరమని తెలిపారు. పట్టణంలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి దేవాలయం, గుత్తి కోట పరిసరాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్‌లో రిజిస్ట్రేషన్ కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వరస్వామిని కలెక్టర్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్లు తదితరులున్నారు.

కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదా?

కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదా?