పనిచేసినా పనిష్‌మెంట్‌! | - | Sakshi
Sakshi News home page

పనిచేసినా పనిష్‌మెంట్‌!

May 27 2025 12:47 AM | Updated on May 27 2025 12:47 AM

పనిచేసినా పనిష్‌మెంట్‌!

పనిచేసినా పనిష్‌మెంట్‌!

ఎస్జీటీ కేడర్‌ సర్వీస్‌ పాయింట్లు కలపని ప్రభుత్వం

6–10 ఏళ్ల సర్వీస్‌ పాయింట్లు కోల్పోతున్న టీచర్లు

పాయింట్ల నమోదులో 2017 బదిలీ టీచర్లకూ తీవ్ర అన్యాయం

లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఏళ్ల తరబడి పని చేసినా...తాజా బదిలీల్లో ప్రభుత్వం తమకు పనిష్‌మెంట్‌ ఇస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎస్జీటీ కేడర్‌కు ఎంపికై పని చేస్తూ...కొన్నేళ్లకు మరో డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికై సర్వీస్‌లో ఒకరోజు కూడా గ్యాప్‌ లేకుండా పని చేస్తున్న టీచర్లకు ఎస్జీటీ కేడర్‌లో పని చేసిన సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘టీచర్ల బదిలీ చట్టం–2025’లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నామంటూ బాధిత టీచర్లు వాపోతున్నారు. ఎస్జీటీ కేడర్‌లో పని చేసిన 6–10 ఏళ్ల సర్వీస్‌ను కోల్పోతున్నారు. ఒక్కో టీచరు 3–5 పాయింట్లు దాకా నష్టపోతున్నారు. గతంలో జరిగిన పలు బదిలీల్లో తమకు ఎస్జీటీ కేడర్‌ పాయింట్లు సర్వీస్‌కు కలిపారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా ఇలాంటి టీచర్లు ఉన్నారు. వారంతా రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మెసేజ్‌లు పెడుతూ ప్రభుత్వానికి తమగోడు వినిపించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా విన్నవించుకుంటున్నారు.

తప్పనిసరి బదిలీ... పాయింట్లలో అన్యాయం

2017లో బదిలీ అయిన టీచర్లందరినీ తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. 8 ఏళ్లు సర్వీస్‌ పూర్తికాకపోయినా ఈనెల 31 కటాఫ్‌ తేదీగా పెట్టి 23.2828 పాయింట్లతో 8 ఏళ్లు పూర్తయినట్లు భావించి వారందరి పోస్టులను ఖాళీలుగా చూపించారు.8 ఏళ్లు అంటే 24 పాయింట్లు ఇవ్వాలి. అదే 2023, 2021 రేషనలైజేషన్‌కు గురైన వారికి పూర్తిగా 24 పాయింట్లు ఇచ్చారు. దీంతో వారందరూ 2017 బ్యాచ్‌ వారికంటే ముందుకు వచ్చారని 2017 బదిలీ అయిన టీచర్లు వాపోతున్నారు.

9 ఏళ్లు సర్వీస్‌ అయినా 8 ఏళ్లకే పాయింట్లు

2014 డీఎస్సీలో ఎంపికై న వారు 2016 జూన్‌ 1న పాఠశాలల్లో చేరారు. వారందరికీ 2024 జూన్‌ 1 నాటికి ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తయింది. వారంతా అదే ఏడాది తప్పనిసరిగా బదిలీ కావాలి. అయితే ఆ ఏడాది బదిలీలు జరగలేదు. ప్రస్తుతం (9వ సంవత్సరం) కూడా అదే పాఠశాలలో పని చేస్తూ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి గరిష్టంగా 8 ఏళ్లకే స్టేషన్‌ పాయింట్లు చూపిస్తున్నారు. ఒక ఏడాదికి స్టేషన్‌ పాయింట్లు పూర్తిగా కోల్పోతున్నారు. 2021, 2023 సంవత్సరాల్లో జరిగిన బదిలీల్లో ఎలాంటి సీలింగు విధించకపోవడం వల్ల గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు పని చేశారో అన్ని సంవత్సరాలకూ స్టేషన్‌ పాయింట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం గరిష్టంగా 8 ఏళ్లు సీలింగ్‌ పెట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని 2014 డీఎస్సీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు హెచ్‌ఎంల తుది సీనియార్టీ జాబితా..

బదిలీల్లో భాగంగా మంగళవారం హెచ్‌ఎంల తుది సీనియార్టీ జాబితా ప్రదర్శించనున్నారు. ఖాళీలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ప్రొవిజినల్‌ సీనియార్టీ జాబితాను ప్రదర్శించనున్నారు. ఎస్జీటీల దరఖాస్తులను నేడు, రేపు పరిశీలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement