
జిల్లాలో అసైన్డ్ భూమి ఇలా
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు ‘కష్ట’ కాలం నడుస్తోంది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోతున్నా.. పరిహారం ఇవ్వడం లేదు... బీమా రాలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందించడం లేదు. ఈ క్రమంలోనే డీ–పట్టా పొందిన అసైన్డ్ భూములకు అర్హత ఉన్నప్పటికీ ఏడాదిగా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.ఈ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపకుండా కూటమి ప్రభుత్వం ఫ్రీజింగ్‌లో పెట్టడంతో సమస్య తలెత్తింది. ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన పేరుతో చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న సాగదీత వైఖరి అసైనీలుగా ఉన్న రైతులకు శాపంగా మారింది. ఆర్థిక అవసరాలకూ భూములను అమ్ముకోలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ సమస్యను బహిరంగంగా చెప్పుకునేందుకూ రైతులు సాహసించలేని పరిస్థితి నెలకొంది. ఆవేదనను బయటకు చెబితే ఎటువైపు నుంచి కొత్త సమస్య వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
● ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1954 జూన్ 18 కంటే ముందు అసైన్డ్ అయిన భూములకు నిరభ్యంతర పత్రం ఉంటుంది. ఇలాంటి భూములు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉండవచ్చని అంచనా. కూటమి ప్రభుత్వం మొత్తం అసైన్డ్ భూములకు సంబంధించి క్రయ, విక్రయాలు, ఇతర ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఏడాదిగా ఫ్రీజింగ్‌లో పెట్టింది. దీంతో నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందిన అసైన్డ్ భూములు కూడా రిజిస్ట్రేషన్ కావడం లేదు.
ఏడాదవుతున్నా..
ప్రభుత్వ భూములను 20 ఏళ్ల క్రితం అసైన్మెంట్‌గా పొందిన వారికి ఫ్రీహోల్డ్ ద్వారా యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటు తరువాత కూటమి ప్రభుత్వం రావడంతో ఫ్రీహోల్డ్ భూముల పరిశీలనకు తెరతీసింది. అయితే, ఏడాది అవుతున్నా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఎప్పటికప్పుడు గడువును పొడిస్తూ సాగదీస్తూనే ఉన్నారు. పరిశీలన పూర్తయ్యే వరకు ఫ్రీజింగ్‌ను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతుల కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేవు.
ఏడాదిగా నిలిచిన డీ–పట్టా రిజిస్ట్రేషన్లు
అసైన్డ్ చేసిన మొత్తం భూమి 2,22,902.05 ఎకరాలు
డీ–పట్టా పొందిన అసైనీలు 78,040
భూమి కలిగిన నిజమైన అసైనీలు 28,115
నిజమైన అసైనీల వద్ద ఉన్న భూమి 75,828 ఎకరాలు
అసైనీల వారసులు 44,156
వారసుల వద్ద ఉన్న భూమి 1,33,425.42 ఎకరాలు
అసైన్డ్ భూమి తీసుకున్న థర్డ్ పార్టీ 5,769
థర్డ్ పార్డీ వద్ద ఉన్న భూమి 13,648.63 ఎకరాలు
పరిశీలన జరుగుతోంది
ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన ప్రక్రియ జరుగు తోంది. మరో రెండు నెలల్లో పూర్తికావొచ్చు. అటు తరువాత అసైన్డ్ భూములకు సంబంధించి లావాదేవీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
– వి.వినోద్‌కుమార్, కలెక్టర్
కూటమి ప్రభుత్వం
ఫ్రీజింగ్‌లో పెట్టడంతో సమస్య
ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన
పేరుతో సాగదీత
వర్ణనాతీతంగా అన్నదాతల ఆవేదన

జిల్లాలో అసైన్డ్ భూమి ఇలా