
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
● వడ్డెర సేవా సంఘం జిల్లా అద్యక్షుడు
లక్ష్మినారాయణ
అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల
సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
అనంతపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా కృష్ణప్రసాద్, రఘురామానాయుడు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రామునాయక్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా అశోక్‌బాబు, నాగేశ్వరయ్య, వెంకటరాముడు, కలీం అహ్మద్, డాక్టర్ శివారెడ్డి, శశిధర్‌రెడ్డి, పౌల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కేసీ నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా హనుమంతు, వరప్రసాద్, చంద్రశేఖర్, భారతమ్మ, మహబూబ్‌బాషా, వసంత, రామాంజినేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రూరల్ కమిటీ అధ్యక్షుడు మారుతీప్రసాద్ పాల్గొన్నారు.
ప్రమాదంలో హెచ్‌ఎం టీవీ రిపోర్టర్ మృతి
ఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్‌ఎం టీవీ రిపోర్టర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బూదగవి గ్రామానికి చెందిన బోయ నాగరాజు (32)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. హెచ్‌ఎం టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, జర్నలిస్టులు పి. షెక్షావలి, కె.ఆనందరావు, వడ్డె రమేష్, సాదిక్, వీరేష్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
కర్ణాటక సరిహద్దున ప్రమాదంలో ఇద్దరి మృతి
శెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) ఉన్నారు. వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.

ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం

ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం

ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం