
‘ఖరీఫ్’ లక్ష్యం 4.38 లక్షల హెక్టార్లు
● అత్యధికంగా
కళ్యాణదుర్గం మండల వ్యాప్తంగా 22,910 హెక్టార్లలో పంటలు
● మొత్తం నీటి వసతి కింద 1,32,321 హెక్టార్లలో సాగు
● వర్షాధారంగా 3,06,450 హెక్టార్ల సాగు అంచనా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు సంబంధించి జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ముంగారు (ఖరీఫ్) వ్యవసాయానికి రైతులు సిద్ధమవుతుండగా... ఇందుకు అనుగుణంగానే ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు అంచనాలు కూడా అధికారులు ఎక్కువగానే అంచనా వేశారు. ఇందులో భాగంగానే నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు తదితర 15 రకాల పంటలు 3,06,450 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. అలాగే నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, ఎండుమిరప, టమాట ఉల్లి, మల్బరీ తదితర పంటలు 1,32,321 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. గత ఐదేళ్లలో ఈ–క్రాప్‌లో నమోదైన గణాంకాల ఆధారంగా ఈ ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు 4,38,771 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనాకు వచ్చారు.
కళ్యాణదుర్గం టాప్
ఖరీఫ్‌లో అటు నీటి వసతి, ఇటు వర్షాధారంగా కళ్యాణదుర్గం మండలంలో 22,910 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారిక అంచనా. ఇందులో నీటి వసతి కింద 6,527 హెక్టార్లు, వర్షాధారంగా 16,383 హెక్టార్లుగా గుర్తించారు. అలాగే తాడిపత్రి మండలంలో అతి తక్కువగా 8,261 హెక్టార్లలో అన్ని రకాల పంటలు వేస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత పెద్దపప్పూరులో 8,372 హెక్టార్లు, పుట్లూరులో 9,412 హెక్టార్లు, యల్లనూరులో 9,728 హెక్టార్లు, బుక్కరాయసముద్రంలో 9,670 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి వస్తాయని లెక్క వేశారు. శింగనమల నియోజక వర్గ పరిధిలో తక్కువ విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. ఇందులోనూ నీటి వసతి కింద ఉద్యాన పంటలు ఎక్కువగానూ, వర్షాధారంగా తక్కువగా పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఓవరాల్‌గా వర్షాధారంగా యల్లనూరు మండలంలో కేవలం 2,243 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తున్నట్లు అంచనా. వరి పంట ఎక్కువగా ఉన్నందున కణేకల్లు మండలంలో 8,204 హెక్టార్లలో నీటి వసతి కింద పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.