
ఈ స్థలం నాది.. కాదనేవారెవ్వరు?
తాడిపత్రి: ‘అధికారం మాది.. ఇక్కడ మేము ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుంది. మమ్మల్ని అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు’ అనే ధోరణి టీడీపీ నేతలో వ్యక్తమైంది. గ్రామ కంఠం స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకుని బండలు పాతేయడమే కాక... ఆ స్థలం తనదని, కాదనేవారెవ్వరూ లేరంటూ దౌర్జన్యానికి తెరలేపిన ఘటన తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు... ఇగుడూరు గ్రామంలోని సర్వే నంబర్ 306లో కొంత స్థలం గ్రామ కంఠంగా ఉంది. ఈ స్థలానికి అవతలి వైపు పట్టా భూముల్లో కొందరు పక్కా గృహాలు నివాసముంటున్నారు. వీరి ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు సర్వే నంబర్ 306లోని గ్రామ కంఠంలోని 12 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉన్న స్థలమే ప్రధాన మార్గం. కాగా, ఈ స్థలానికి ఓ వైపు పుల్లన్న అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుని 30 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అతడి ఇంటి ముందర రస్తాకు ఓ వైపు పంచాయతీ బోరును వేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సదరు రస్తాతో పాటు పుల్లన్న ఇంటిని ఆక్రమించుకునేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ వారాది పావులు కదిపాడు. ఇందులో భాగంగానే గత నెల 9న టీడీపీకి చెందిన బాలమద్దిలేటి మరికొందరితో కలసి పంచాయతీ బోరును దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయంగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం బోయ వారాది, బాల మద్దిలేటి మరికొందరు కలసి రస్తాను ఆక్రమించి అటు వైపు నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా దౌర్జన్యంగా బండల పాతారు. ఇది చూసిన స్థానికులు అడ్డుకోబోతే ఆ స్థలం తనదంటూ వారాది దౌర్జన్యానికి తెగబడ్డాడు. రెవెన్యూ అధికారుల అండతోనే టీడీపీ నేతలు బరి తెగించారని, సమస్య పరిష్కారానికి తహసీల్దార్ రజాక్‌వలి ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ ఇళ్లకు రాకపోకలు సాగించేలా ఉన్న రస్తా ఆక్రమణలను తొలగించాలని కోరారు.
గ్రామ కంఠాన్ని ఆక్రమించి బండలు పాతిన టీడీపీ నేత
రెవెన్యూ అధికారుల అండతోనే దౌర్జన్యమంటున్న స్థానికులు