
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు.. రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మాల రామచంద్ర (61) మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేయడానికి అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి తూర్పున శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గుంత తీసేందుకు కొందరు దళితులు అక్కడికి వెళ్లడంతో ఆ స్థలం తమదంటూ అదే గ్రామానికి చెందిన పలువురు కాలువ గొంచి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలంటూ రోడ్డుపై మృతదేహన్ని ఉంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాప్తాడు, రూరల్ సీఐలు శ్రీహర్ష, శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వందేళ్లుగా తమ పూర్వీకుల అనుభవంలో ఉంటూ వచ్చిన భూమిని దళితుల శ్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారంటూ కాలువగొంచి నిర్వాహకులు మండిపడ్డారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను గత ఏడాది ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి తూర్పున ఉన్న సర్వే నంబర్ 281–4లో 1.08 ఎకరాలను దళితుల శ్మశాన వాటికకు కేటాయించాలంటూ అప్పట్లో ఆర్డీఓకు ఎమ్మెల్యే సూచించారని, దీంతో నాలుగు నెలల క్రితం శ్మశాన వాటికకు కేటాయిస్తూ తహసీల్దార్ విజయకుమారి పట్టాను ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగానే తమకు ఇప్పించారంటూ దళితులు ప్రతిగా స్పందించారు. ఈ విషయంపైనే తాము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్లుగా కాలువగొంచి రైతులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోర్టు స్టే ఆర్డర్‌ను చూపారు. గ్రామానికి దక్షిణం వైపు 3.80 ఎకరాల శ్మశాన వాటిక ఉందని, అక్కడికెళ్లి ఖననం చేసుకోవాలని సూచించారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమారి అక్కడకు చేరుకుని దళితులతో చర్చించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. ఈ అంశంలో న్యాయం చేస్తానని, శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించి పాత శ్మశాన వాటికలోనే రామచంద్ర మతృదేహాన్ని ఖననం చేశారు. కాగా, ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను ఎమ్మెల్యే పరిటాల సునీత మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.