
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీపి కబురు చెబుతోంది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈసారి ఈ నెల 26నే తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈ నెల 29 నాటికే ఉమ్మడి ‘అనంత’లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. జూన్ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్ మాన్‌సూన్స్) అత్యంత కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదు కావాల్సి ఉంటుంది.
నైరుతి వర్షాలపై గంపెడాశలు
ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 7 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు.
= ఇదిలా ఉండగా రాగల ఐదు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణంగా జూన్ రెండో వారంలోనే జిల్లాకు రుతుపవనాలు
అయితే ఈ సారి ఈనెలాఖరుకే ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడి
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ‘ఖరీఫ్’కు నైరుతి ప్రభావంతో వర్షాలు
319.6 మి.మీ సాధారణం కన్నా అధిక వర్షపాతంపై అన్నదాత ఆశలు

ముందస్తుగా ఆశల ‘నైరుతి’