
30 శాతం రాయితీతో కందులు, పెసలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు ఇవ్వనున్నారు. ఈ మేరకు వాటి ధరలు, రాయితీలు ప్రకటించారు. విత్తన వరికి సంబంధించి జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) అమలు చేస్తున్న జిల్లాల్లో క్వింటా వరి విత్తనాలపై రూ.వెయ్యి రాయితీ వర్తింపజేయగా, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం అమలులో లేని జిల్లాల్లో రూ.500 రాయితీ ఇవ్వనున్నారు. అంటే క్వింటా 5,204 రకం వరి విత్తనాలు పూర్తి ధర రూ.4,300 కాగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం జిల్లాల్లో రూ.1,000 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.3,300 చెల్లించాలి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం లేని జిల్లాల్లో రూ.500 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.3,800 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక విత్తన కందులు క్వింటా పూర్తి ధర రూ.10,950 కాగా 30 శాతం అంటే రూ.3,285 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.7,665 ప్రకారం చెల్లించాలి. అలాగే మినుములు పూర్తి ధర రూ.13,800 కాగా అందులో 30 శాతం అంటే రూ.4,140 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.9,660 ప్రకారం చెల్లించాలి. పెసలు పూర్తి ధర రూ.13,500 కాగా అందులో 30 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.9,450 ప్రకారం చెల్లించాలి. కొర్రలు క్వింటా పూర్తి ధర రూ.6 వేలు కాగా.. 50 శాతం రూ.3 వేలు రాయితీ పోనూ మిగతా రూ.3 వేల ప్రకారం చెల్లించాలి. రాగులు పూర్తి ధర రూ.6,900 కాగా అందులో రాయితీ పోనూ రూ.3,450 ప్రకారం చెల్లించాలి. కందులు, పెసరలు, మినుములు 4 కిలోల ప్యాకెట్ల రూపంలోనూ, కొర్రలు, రాగులు 2 కిలోల ప్యాకెట్ల కింద ఇవ్వనున్నారు. భూ విస్తీర్ణం బట్టి కందులు, పెసలు, మినుములు ఒక్కో రైతుకు గరిష్టంగా 10 బ్యాగులు, కొర్రలు 5 బ్యాగులు, రాగులు 6 బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి. ఇక.. వేరుశనగకు సంబంధించి ఇంకా ధరలు, రాయితీ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వేరుశనగ క్వింటా రూ.9,300 కాగా అందులో 40 శాతం రాయితీ రూ.3,720 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
50 శాతం రాయితీతో రాగులు, కొర్రలు
విత్తన వరిపై రూ.500,
రూ.వెయ్యి రాయితీ

30 శాతం రాయితీతో కందులు, పెసలు