
ప్రజా ప్రతినిధులా.. వీధి రౌడీలా?
అనంతపురం సిటీ: ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్ ప్రజా ప్రతినిధుల్లా కాకుండా వీధి రౌడీల్లా ప్రవర్తించడం దారుణమని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు విమర్శించారు. చైర్‌పర్స్‌న్ బోయ గిరిజమ్మ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉండగా, ఆమె అనుమతి లేకుండా చాంబర్‌లోకి బలవంతంగా వెళ్లడాన్ని తప్పుబడుతూ అనంతపురం జెడ్పీ కార్యాలయం ఎదుట గల అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం నిరసన తెలిపారు. బీసీ కులానికి చెందిన బోయ గిరిజమ్మను అవమానించడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు జెడ్పీకి వచ్చారని బహుజన యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రచర్ల హరి దుయ్యబట్టారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మతో పాటు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయవేదిక ప్రతినిధి కుళ్లాయప్ప, కనగానపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న, జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామాంజనేయులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు గంగవరం శశి, నసనకోట ముత్యాలు, మాదాపురం అనిల్, ఉపాధ్యక్షుడు యోహాన్, ఏపీ కార్మిక సంఘం ప్రతినిధి నాగేంద్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్, బేడ, బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు తాటికొండ నాగరాజు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షుడు సాకే వన్నూరుస్వామి పాల్గొన్నారు.