
దేవరపల్లి గ్రామ ముఖచిత్రం
ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, ఆహారం కోసం అటు ఇటు తిరిగే సాధు జంతువులు.. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న చెట్లు, తోటలు, పంట చేలతో ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉండే ఊరు. అక్కడ వాహనాల మోతలు వినిపించవు. వ్యవసాయ ఆధారత గ్రామంలో కల్మషం లేని రైతు బిడ్డలు సరస్వతీ పుత్రులుగా రాణిస్తున్నారు.
పామిడి: మండలంలోని దేవరపల్లి గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలను పండిస్తున్నారు. దేవరపల్లి పంచాయతీ పరిధిలో మజారా గ్రామంగా ఓబుళాపురం కూడా ఉంది. ఈ గ్రామం కూడా పూర్తిగా వ్యవసాయాధిరతమే. రెండు గ్రామాల్లోనూ 3,200 మంది జనాభా ఉండగా... ప్రతి ఇంట్లోనూ అక్షరాస్యులే కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది టీటీసీ, డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు అభ్యసించి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారూ ఉన్నారు. ఇటీవల కొందరు సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. మొత్తం 50 మందికి పైగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన వారు ఉన్నారు.
స్థితిగతులు మార్చిన చదువు
దశాబ్దాల క్రితం దేవరపల్లిలోనూ నిరక్షరాస్యత రాజ్యమేలింది. సంస్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ఈ క్రమంలోనే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు ఎక్కువ కావడం... కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గ్రామస్తుల దృష్టి ఒక్కసారిగా చదువులపై పడింది. తమలా భవిష్యత్తులో పిల్లలు కష్టపడకూడదని భావించిన వారు.. పిల్లలను బడి బాట పట్టించారు. ఇది వారి స్థితిగతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువుల ప్రస్థానం నేడు పదుల సంఖ్యలో చేరుకుంది. కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే 50 మందికి పైగా స్థిరపడ్డారు.
మరికొందరు రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. వృత్తి వ్యాపారాల్లోనూ రాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకుని పంటల సాగు చేపట్టారు. పత్తి, వేరుశనగ, జొన్న, కొర్ర, పప్పుశనగ పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలతో ఆదర్శ జీవనం సాగిస్తున్నారు.
గురువులే ఆదర్శం
మా తల్లిదండ్రులకు పది మంది సంతానం కాగా, వీరిలో ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అందరిలోకి నేనే లాస్ట్. వ్యవసాయం ఒక్కటే మా జీవనాధారం. మా నాన్న నారప్ప అప్పట్లో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వ్యవసాయంలో నష్టాలు చూసి విసిగి పోయిన ఆయన చదువులు ఒక్కటే మా జీవితాలు మారుస్తాయని అనేవారు. అప్పట్లో మా ఊళ్లో పాఠాలు చెప్పేందుకు వచ్చే టీచర్లు పి.జయరాజు, టి.ఈశ్వరయ్య కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పారు. వారి స్ఫూర్తితోనే నేనూ ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. మా అక్క గౌరమ్మ, బావ, నా భార్య సైతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
– రామ్మోహన్, స్కూల్ అసిస్టెంట్, దేవరపల్లి గ్రామం
ఎంతో సంతృప్తినిస్తోంది
మాది వ్యవసాయ కుటుంబమే. మా తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం కాగా, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కరువు పరిస్థితుల వల్ల పంటల సాగులో నష్టాలు వచ్చేవి. దీంతో చదువులు ఒక్కటే మా జీవితాలు మారుస్తాయని నమ్మిన అమ్మ, నాన్న మమ్మల్ని బడి బాట పట్టించారు. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది.
– నారాయణస్వామి, దేవరపల్లి గ్రామం

రామ్మోహన్, స్కూల్ అసిస్టెంట్, దేవరపల్లి గ్రామం

నారాయణస్వామి, దేవరపల్లి గ్రామం