డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వయసు మీరిపోతున్నా... పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్నాటకలోని సండూరు తాలూకా తుమటి గ్రామానికి చెందిన గంగాధర్ (32) తోరనగల్లు సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులో మరో పని చేసుకునేందుకు వెళుతున్న ఇంట్లో చెప్పి నెల రోజుల క్రితం బయటకు వచ్చాడు. అనంతరం కుటుంబసభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు.
దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం తుమటి గ్రామ శివారున కర్ణాటక సరిహద్దులోని డి.హీరేహాళ్ మండలం సిద్దాపురం గ్రామ శివారులో చెట్టుకు వేసుకున్న ఉరికి వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. విచారణలో మృతుడిని గంగాధర్‌గా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి నిర్ధారించారు. పెళ్లి ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి తండ్రి సిద్ధేశ్వర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు.
వ్యక్తి దుర్మరణం
గుత్తి రూరల్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (44) వ్యక్తిగత పనిపై గురువారం గుత్తికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహ ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
‘కేంద్రియ’లో ప్రవేశాలకు దరఖాస్తులు
గుత్తి: పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మల్కీ సాబ్ తెలిపారు. స్థానిక విద్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 30 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టెన్త్‌లో మ్యాథ్స్, సైన్స్‌లలో 60 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.