
భూసేకరణ ప్రతిపాదనలు పంపండి
● అధికారులతో జేసీ శివ్‌నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. భూ సేకరణ అంశంపై సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. జాతీయ రహదారులు 544డి, 67, 150తో పాటు రైల్వే, ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, భూ బదలాలియింపుపై పెండింగ్ ప్రతిపాదనలు జాతీయ రహదారి అధికారులకు పంపించాలని ఆర్‌డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎన్‌హెచ్ పీడీ తరుణ్‌కుమార్, భూ విభాగం సూపరిటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చెరువు మట్టినీ బొక్కేస్తున్నారు...
పెద్దవడుగూరు: మండలంలోని చిత్రచేడు గ్రామంలో మట్టి దందాకు స్థానిక టీడీపీ కార్యకర్తలు తెరలేపారు. గత రెండు రోజుల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసేందుకు గ్రామంలోని రెండు వర్గాల వారు జేసీబీలతో మట్టిని తరలించేందుకు ప్రయత్నించడంతో అధికారులు తక్షణమే స్పందించి అడ్డుకున్నారు. ఇదే అదునుగా చేసుకుని గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఏకంగా పది ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని, చెరువులోని మట్టిని జేసీబీలతో పెకలించి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీ పెద్దల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే టీడీపీ బడా నేత ఫోన్ చేయడంతో వాటిని అక్కడే వదిలేసి వచ్చారు. కాగా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చెరువులోని మట్టిని తరలిస్తుండటంపై విమర్శలు వ్యక్తవమవుతున్నాయి.
ఆ టీచర్లకు ప్రాధాన్యతనివ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్దీకరణకు రూపొందించిన నిబంధనల్లో స్టేషన్ పాయింట్లకు సంబంధించి ఒక పాఠశాలలో 8 ఏళ్లు పూర్తి కాకుండానే రేషనలైజేషన్‌కు గురవుతున్న టీచర్లకు 8 ఏళ్ల పూర్తి పాయింట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసనాయక్ మాట్లాడారు. సీనియర్/జూనియర్ ఎవరు రీ అపోర్షన్‌కు గురైనా రీఅపోర్షన్ పాయింట్లు కేటాయించాలన్నారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్ కల్పించి మోడల్ ప్రైమరీ పాఠశాలలకు నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతాన్ని 1:45 ప్రకారం నిర్ధారిస్తూ పోస్టులు కేటాయించాలన్నారు. బదిలీ పాఠశాలల్లో పోస్టులు బ్లాక్ చేయరాదన్నారు. ఇంగ్లిషు తదితర సబ్జెక్టుల సీనియార్టీ లిస్టు ఫైనలైజ్ చేసి.. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించిన తర్వాతనే మిగులు పోస్టులు ప్రకటించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, సత్యప్రసాద్, అశోక్ నాయక్, వజీర్ బాషా, నారాయణ నాయక్, దామో దర్ రామాంజనేయులు, హుసేన్‌ఖాన్ పాల్గొన్నారు.

భూసేకరణ ప్రతిపాదనలు పంపండి