ఊరూరా ఉద్విఘ్నం | - | Sakshi
Sakshi News home page

ఊరూరా ఉద్విఘ్నం

May 11 2025 7:30 AM | Updated on May 11 2025 7:30 AM

ఊరూరా

ఊరూరా ఉద్విఘ్నం

దేశరక్షణలో నేలకొరిగి భరతమాత నుదిట తిలకమై నిలిచిన వీర జవాన్‌ మురళీనాయక్‌కు అనంత ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి కల్లితండా వరకూ వెంటసాగి జోహార్‌ అగ్నివీరుడా అంటూ నినదించింది.

వీరసైనికుడు మురళీ నాయక్‌కు ఘన నివాళి

స్వగ్రామం చేరుకున్న వీర జవాన్‌ భౌతికకాయం

బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు తరలింపు

దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన నివాళులు

ఊరూరా వందేమాతరం ఆలపించిన ప్రజలు

రోడ్డుకు ఇరువైపులా నిలబడి సైనికుడికి సెల్యూట్‌ చేసిన వైనం

నేడు కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

తరలిరానున్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు

గోరంట్ల: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్మూకశ్మీర్‌లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన కల్లితండాకు చెందిన జవాన్‌ మురళీనాయక్‌ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వందేమాతరం పాడుతూ మురళీనాయక్‌కు ఘన నివాళులర్పించారు.

ఘొల్లుమన్న కల్లితండా

సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్‌, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్‌ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. ‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్‌ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్‌ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో అధికార లాంఛనాలతో మురళీనాయక్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఊరూరా ఉద్విఘ్నం1
1/1

ఊరూరా ఉద్విఘ్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement