
అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండానే ప్రారంభోత్సవం
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత మాత్రం విలువ లేదని తేలిపోయింది. ఇందుకు ఆత్మకూరు మండలం పంపనూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవమే నిదర్శనం. గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేకుండానే శుక్రవారం స్థానిక టీడీపీ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ప్రభుత్వాధికారులు వాపోతున్నారు. ఎంపీపీకు, సర్పంచ్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శిలాఫలకంలో తహసీల్దార్, ఈఓఆర్డీ, పంచాయతీ సెక్రటరీ పేర్లు లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
యువకుడి బలవన్మరణం
అనంతపురం: మద్యం సేవించడం మానలేక జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న ఇగవే పరుశురాం (34)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు ఉన్నారు. పాత చీరల వ్యాపారం చేసే వారి వద్ద కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన నాలుగేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. కూలీ పనులతో సంపాదించిన డబ్బు మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టేవాడు. దీంతో సంసారం గడవడం కష్టమైంది. ఇప్పటికీ ఐదు నెలల ఇంటి అద్దెలు కూడా చెల్లించలేకపోయాడు. మూర్ఛ వ్యాధి తిరగబెడుతుండడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాడు. మద్యం మానేస్తే నయమవుతుందని వైద్యులు తెలపడంతో దిక్కుతోచలేదు. మద్యం లేకపోతే తాను చనిపోతానంటూ కుటుంబసభ్యులతో చెప్పుకునే వాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు సముదాయిస్తూ వచ్చేవారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అతిగా జ్వరం బారిన పడ్డాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి బెడ్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు
అనంతపురం అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం స్థానిక రెవెన్యూ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, డీఏ ప్రకటించకపోవడం, డీఏ, పీఆర్సీ ఆరియర్లపై స్పష్టత లేకపోవడం, మధ్యంతర భృతి ఊసేత్తకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఫలితం మరో విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష, జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఖాన్, మహిళ విభాగం జిల్లా చైర్మన్ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణజ్యోతి, జిల్లా నాయకులు, శ్రీసత్యసాయి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండానే ప్రారంభోత్సవం