కమీషన్లు తప్ప నీళ్లు పారించడం లేదు | - | Sakshi
Sakshi News home page

కమీషన్లు తప్ప నీళ్లు పారించడం లేదు

May 9 2025 1:43 AM | Updated on May 9 2025 1:43 AM

కమీషన్లు తప్ప నీళ్లు పారించడం లేదు

కమీషన్లు తప్ప నీళ్లు పారించడం లేదు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘రాయలసీమ జిల్లాల్లో హంద్రీ–నీవా ఆయకట్టు గ్రామాల్లో 40 టీఎంసీల నీళ్లు పారించేలా వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాలువను తీసుకొచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు పారిస్తున్నారు తప్ప నీళ్లు పారించడం లేదు. హంద్రీ–నీవా లైనింగ్‌ పనుల పర్యవేక్షణకు శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గానికి వస్తున్న సీఎం చంద్రబాబు ఇక్కడి రైతుల మనోభావాలను తెలుసుకుంటే బాగుంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా కాంక్రీట్‌ లైనింగ్‌ పనులను రైతులు, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఇక్కడి రైతాంగ ప్రయోజనాలను తుంగలో తొక్కి కుప్పానికి నీళ్లు తరలించాలని చూస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీ–నీవాను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 83 టీఎంసీలకు పెంచారన్నారు. వైఎస్సార్‌, చిత్తూరు జిల్లాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం గండికోట నుంచి గాలేరు–నగరి ద్వారా 20 టీఎంసీల ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిందన్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల దాకా ఖర్చు చేశారన్నారు. తక్కిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. గండికోట నుంచి 20 టీఎంసీల నీళ్లు వైఎస్సార్‌, చిత్తూరు జిల్లాలకు తీసుకెళ్తే...ఆ మేరకు 20 టీఎంసీల నీళ్లు అనంతపురం, కర్నూలు జిల్లాలకు మిగులుతాయన్నారు. ‘దివంగత నేత ఎన్టీఆర్‌ను అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడాలని లేదా.. మా ప్రాంత ప్రజలు వ్యవసాయం వదిలి బెంగళూరు, కేరళ ప్రాంతాలకు భిక్షాటనకు పోవాలని భావిస్తున్నారా’ అని మండిపడ్డారు.

శ్రీ సత్యసాయి, ఆర్డీటీ ట్రస్టులు

జిల్లాకు రెండు కళ్లు

భగవాన్‌ సత్యసాయి బాబా, ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆదర్శమూర్తులని ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఆర్డీటీ సంస్థపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, విదేశాల నుంచి నిధులు అందకుండా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు సత్యసాయి బాబా గౌరవాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి, ఆర్డీటీ ట్రస్టులు జిల్లాకు రెండు కళ్లులాంటివని, వాటికి ప్రాణం పోయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రామగిరి మండల పర్యటనలో హెలికాప్టర్‌ దిగిన తర్వాత ఆయనపై అభిమానంతో వేలాదిమంది హెలీప్యాడ్‌ వద్దకు చొచ్చుకువచ్చారని, ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనన్నారు. హెలీప్యాడ్‌లోకి కేవలం 41 మందిని అనుమతించాలని ఎస్పీకి జాబితా అందజేసినా అంతమంది చొచ్చుకువచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానిదా... పోలీసులదా... తమదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కొన్ని మీడియా సంస్థలు అబద్ధాలను ప్రచారం చేశాయన్నారు. తనకు డీఎస్పీ విజయకుమార్‌ మైకు ఇస్తే... హెలీప్యాడ్‌ వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ తాను రోడ్డుపైనే కూర్చుని, అందరూ ఇక్కడే కూర్చోవాలంటూ పదేపదే కోరానన్నారు. పోలీసుల వైఫల్యం వల్ల జగనన్నకు ప్రాణహాని కలుగుతోందని, ఆయన భద్రతపై కేంద్ర హోంమంత్రి, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డికి భద్రతను తప్పించడానికి, ఆయనకు అపాయం తలపెట్టడానికి ప్రకాష్‌రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించారంటూ తనవైపు మళ్లించారన్నారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన హత్యను మరుగుపరచడానికి మీడియా చేసిన పాపం ఇదన్నారు. కురుబ లింగమయ్యపై దాడి చేసిన సమయంలో 20 మంది ఉన్నారని కుమారులే చెబుతున్నా కేవలం ఇద్దరిపై కేసు పెట్టి తక్కిన 18 మందిని తప్పించారన్నారు. హంతకుల ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డిని రానీయనని, హెలికాప్టర్‌ దిగనీయనని మాట్లాడిన పరిటాల సునీత నోరు నొక్కాల్సింది పోయి హత్యను ఖండించిన, ప్రశ్నించిన తమ గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు. సమావేశంలో అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, బండి పవన్‌, మాదవరెడ్డి, మంజునాథ్‌, నరేంద్రరెడ్డి, లోకనాథరెడ్డి, ఈశ్వరయ్య, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

మా ప్రాంత ప్రజలను భిక్షాటనకు

పంపాలని చూస్తున్నారా?

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement