
అకాల వర్షాలకు రూ.35.47 కోట్ల పంట నష్టం
● కలెక్టర్ వి.వినోద్ కుమార్
అనంతపురం అర్బన్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.35.47 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ 21న కురిసిన వర్షానికి వ్యవసాయ పంటలకు రూ.15.90 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.93 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. అదే నెల 29న కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ పంటలకు రూ.16 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.63 లక్షలు, ఈ నెల 3వ తేదీ కురిసిన వర్షానికి వ్యవసాయ పంటలకు రూ.38 లక్షలు, ఉద్యాన పంటలకు రూ.1.63 కోట్ల నష్టం సంభవించిందన్నారు. ఇందుకు సంబం ధించి నివేదికలను ప్రభుత్వానికి పంపించామన్నారు. వేసవిలో అకాల వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు పిడుగుల కారణంగా ఒకరు మృతి చెందారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ‘పీ–4’ సర్వే నిర్వహించి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 63,379 కుటుంబాలను గుర్తించామన్నారు. సంపన్నుల సహకారంతో వీటిని బంగారు కుటుంబాలుగా మారుస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు, సంపన్నులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సీపీఓ అశోక్‌కుమార్, కో–ఆర్డినేషన్ విభాగం సూపరిటెండెంట్ యుగేశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు.