
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వజ్రకరూరు: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద ఏర్పాట్లను ఎస్పీ పి. జగదీష్‌తో కలిసి జేసీ పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓలు కేశవనాయుడు, శ్రీనివాసులు, డీపీఓ నాగరాజునాయుడు, జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రా రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ జహీర్‌అస్లాం పాల్గొన్నారు.
‘గ్రూప్–1 మెయిన్స్’ కేంద్రాల పరిశీలన
అనంతపురం అర్బన్: ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. అనంతపురంలో పరీక్ష కేంద్రాలను జేసీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయన్నారు. 9వ తేదీతో ముగుస్తాయన్నారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షకు 594 మంది హాజరుకావాల్సి ఉండగా నాల్గో రోజు 381 మంది హాజరయ్యారని, 213 మంది గైర్హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో లైజనింగ్ అధికారులు, ఎస్‌డీసీలు మల్లికార్జునుడు, తిప్పేనాయక్ ఉన్నారు.