ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేదు. తమ భూముల విలువ పెంచుకోవడం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లతో అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. ఆలసించినా ఆశాభంగం అని తొందరపెడుతున్నారు. అమాయకులు నిజమని నమ్మి.. సంపాదించుకున్న డబ్బుతో పాటు.. వడ్డ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేదు. తమ భూముల విలువ పెంచుకోవడం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లతో అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. ఆలసించినా ఆశాభంగం అని తొందరపెడుతున్నారు. అమాయకులు నిజమని నమ్మి.. సంపాదించుకున్న డబ్బుతో పాటు.. వడ్డ

May 6 2025 1:16 AM | Updated on May 6 2025 1:16 AM

ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేదు. తమ భూముల విలువ పెంచుకోవడ

ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేదు. తమ భూముల విలువ పెంచుకోవడ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురానికి ఎయిర్‌పోర్ట్‌ వస్తోందని, అతి కొద్ది నెలల్లోనే ఫ్లైట్‌లు దిగుతాయని జరుగుతున్న ప్రచారం సామాన్యులను విస్మయ పరుస్తోంది. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చేస్తున్న ఈ ప్రచారం మాయలో పడి చాలామంది భూములు, ప్లాట్లు అధిక ధరలకు కొని తీవ్రంగా నష్టపోతున్నారు. వందల ఎకరాల భూములు కొన్న స్థిరాస్తి పెట్టుబడిదారులు దానిని సొమ్ము చేసుకునేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉదయాన్నే కాలేజీలు, ప్లే గ్రౌండ్‌లు, పార్కుల వద్దకు వచ్చే వాకర్స్‌కు కరపత్రాలు పంచుతున్నారు. దానిపై ఎయిర్‌పోర్ట్‌ డిజైన్‌తో పాటు హైవే దూరం, ప్లాట్ల లేఅవుట్‌ వంటివన్నీ చూపిస్తోంటే చాలామంది నిజమేనేమో అని నమ్మేస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ పేరుతో

కూడేరు మండల కేంద్రం జిల్లా కేంద్రం అనంతపురానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో తలుపూరు, సజ్జల కాల్వ, బాపనపల్లె గ్రామాల్లో సుమారు 1,500 ఎకరాలు సేకరిస్తున్నారని, ఇక్కడ ఎయిర్‌పోర్టు ఖరారైందని రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు చెబుతున్న కహానీ. ఇదంతా ప్రైవేటు భూమే. ఎకరాకు కనీసం రూ.30 లక్షలు ధర చెల్లించినా భూమికే రూ.450 కోట్లు చెల్లించాలి. కనీసం వంద ఎకరాలు ప్రభుత్వ భూమి లేకుండా ఎయిర్‌పోర్ట్‌ సాధ్యమా అన్నది నిపుణుల మాట. రోజుకో ప్రచారంతో ఆ ప్రాంత రైతులు భయాందోళన చెంది, తమ భూములు ఎయిర్‌పోర్టుకు ఎక్కడ లాక్కుంటారోనని ఏకంగా జాయింట్‌ కలెక్టర్‌ను కలిశారు. ఇదంతా నిజం కాదని, మీరు అలాంటివేవీ నమ్మొద్దని చెప్పి పంపించారు.

ఆరులేన్ల రహదారి పేరుతోనూ...

ప్రస్తుతం బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారి నాలుగు లేన్లుగా ఉంది. ఈ రహదారిని ఆరులేన్ల రహదారిగా చేస్తున్నారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో చాలామంది చిన్న చిన్న పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ జాతీయ హైవే అథారిటీ అధికారులు మాత్రం అలాంటి ప్రతిపాదనే లేదని చెబుతున్నారు. జాతీయ రహదారి ఆనుకుని కొడికొండ నుంచి గుత్తి వరకు వందల ఎకరాల్లో వెంచర్లు వేసిన బడా పెట్టుబడి దారులు చేస్తున్న దుష్ప్రచారంతో సగటు మదుపరులు నష్టపోతున్నారు. ఎయిర్‌పోర్టు, రహదారి వెడల్పు పనులు అయ్యాక ధరలు పెరిగిపోతాయని, ఇప్పుడు కొనుక్కుంటే చౌకగా లభిస్తాయని నమ్మబలికిస్తున్నారు. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌ గూగుల్‌ లొకేషన్‌ అంటూ ఫ్లెక్సీల్లో వేసి చూపిస్తున్నారు. దీంతో చిరు వేతనజీవులు ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు కొనుక్కుని నిండా మునిగిపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి దారులంతా టీడీపీ నేతలే ఉండటం గమనార్హం.

అనంతపురంలో ఎయిర్‌పోర్ట్‌ వస్తోందని ప్రచారం

కూడేరు ప్రాంతంలో నేడో రేపో ఫ్లైట్‌లు దిగుతాయని లీకులు

పెద్ద పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఓనర్లు కర పత్రాలతో మార్కెటింగ్‌

బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారి 6 లేన్లు అవుతుందని మరో ప్రచారం

ఇప్పటివరకూ ఆరు లేన్ల ప్రతిపాదనే లేదంటున్న జాతీయ హైవే అథారిటీ

ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుపై ఇప్పటివరకూ సంప్రదింపులే జరగలేదన్న కలెక్టర్‌

నమ్మించి నట్టేట ముంచడానికి యత్నిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement