
వాడిపోతున్న జలపుష్పాలు
రాయదుర్గం: ప్రచండ భానుడి భగభగలకు జిల్లా నింపుటి కుంపటిని తలపిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల ధాటికి మనుషులే కాదు జీవరాసులూ విలవిల్లాడుతున్నాయి. ఈ తాపం భూమిపై ఉన్న జీవరాసులకే కాదు.. నీటిలో ఉన్న జలచరాలను సైతం తాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రత కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, నీటికుంటల్లోని చేపలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో వేసవి తాపం తాళలేమంటూ లోతైన నీటిలోకెళ్లి దాక్కుంటున్నాయి.
రూ.12 కోట్ల ఆదాయానికి గండి
అనంతపురం– ఎంపీఆర్ మత్స్య క్షేత్రాల వద్ద 100 ఎంఎం పరిమాణంతో ఉత్పత్తి చేసిన 19.5 లక్షల చేప పిల్లలను ప్రభుత్వ ధర ప్రకారం మత్స్యకార సంఘాలకు సరఫరా చేశారు. అలాగే మధ్యతరహా ప్రాజెక్టులైన బైరవానితిప్ప ప్రాజెక్టులో ఈ ఏడాది 6.48 లక్షలు, పీఏబీఆర్‌లో 12 లక్షలు చేప పిల్లలను వంద శాతం రాయితీతో విడుదల చేశారు. దీనికి తోడు ప్రధాన మంత్రి మత్స్య సహకార పథకం కింద జిల్లాలోని బుక్కరాయసముద్రం, పుట్లూరు, శింగనమల, చాగల్లు, గుత్తి పెద్ద చెరువు, జంబులదిన్నె, మాముడూరు, కలుగోడు, రంగసముద్రం, గుమ్మఘట్ట కమతం చెరువు, పెద్ద ట్యాంకు, గూళ్యం, బెట్టిట్యాంకు భూపసముద్రం, శ్రీధరఘట్ట, తదితర 15 చెరువుల్లో మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 40 శాతం రాయితీతో 14.86 లక్షల చేపపిల్లల పెంపకం చేపట్టారు. ఈ చెరువుల ద్వారా చేపల ఉత్పత్తి జరిగితే 356 టన్నులకు గాను రూ.3.56 కోట్లు, జలాశయాల ద్వారా 918 టన్నులకు గాను రూ.9.18 కోట్లు ఆధాయం రావచ్చని మత్స్యశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ దిగుబడిపై ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎక్కడికక్కడ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో నీరు అడుగంటే కొద్ది చేపలు మృత్యువాత పడుతున్నాయి. మధ్యాహ్నం నేరుగా తాకే సూర్యకిరణాల తీవ్రతను తాళలేక చేపలన్నీ ఒకేచోటకు పోగవుతున్నాయి.
భానుడి భగభగలకు
వేడెక్కుతున్న నీరు
వేడిని తట్టుకోలేక మృత్యుఒడికి చేరుతున్న చేపలు