
ప్రమాదంలో వ్యక్తి మృతి
గుత్తి రూరల్: ఆటో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (45) సోమవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతున్న తన వదిన భీమక్కను చికిత్స కోసమని గుంతకల్లులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పిలుచుకెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు గుత్తి శివారులోని నేమతాబాదు జగనన్న కాలనీ వద్దకు చేరుకోగానే చెరువుకట్ట వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో రమేష్, భీమక్క తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక రమేష్ మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బీసీల పేరుతో బహిరంగ దోపిడీ
● వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కురుబ దేవేంద్ర
అనంతపురం కార్పొరేషన్: బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం బహిరంగ దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కురుబ దేవేంద్ర, నగర అధ్యక్షుడు లక్ష్మణ్ణ విమర్శించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు 50 రోజుల పాటు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. శిక్షణకు హాజరయై ప్రతి మహిళకూ రూ. 3 వేల స్టయిఫండ్‌తో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్‌ను ఉచితంగా అందజేసేలా కార్యాచరణను రూపొందించారన్నారు. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.23 వేలు వెచ్చిస్తున్నట్లుగా ప్రకటిచిందన్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... శిక్షణ కాలంలో చెల్లించే రూ.3 వేల స్టయిఫండ్, ఉచితంగా అందజేసే కుట్టు మిషన్ ధర రూ.4,300 పోను... రూ.23 వేలలో మిగిలిన రూ.15,700 ఏమవుతున్నదో అంతు చిక్కడం లేదన్నారు. శిక్షణ సమయంలో దారం, టేపు, కత్తెర, స్కేల్ వంటి పరికరాలను లబ్ధిదారులే సమకూర్చుకుంటున్నారన్నారు. మొత్తం ఈ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు కాగా, మిగిలిన రూ.167 కోట్లను దిగమింగేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థలను పక్కన పెట్టి, సొంత సంస్థలకు శిక్షణ కాంట్రాక్ట్‌లను కట్టబెట్టి కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకొనేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దల తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సెల్ నాయకులు గోగుల పుల్లయ్య, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.