
జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
అనంతపురం అర్బన్: హైకోర్టు ఆదేశాలను చట్ట ప్రకారం అమలు చేయాలని పోలీసు అధికారులకు డిబెట్‌లో సూచించిన మాటలపై ఆక్రోశంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి సీపీఎంను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరి కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి నల్లప్ప అన్నారు. జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయాలని మాత్రమే డిబెట్‌లో చెప్పామన్నారు. గతంలో అప్రజాస్వామ్యంగా జేసీ ప్రభాకరరెడ్డిని అరెస్టు చేసినప్పుడు, జేసీ ఇంటికి పెద్దారెడ్డి వెళ్లినప్పుడు కూడా టీడీపీ కంటే ముందు ఖండించింది తామేనని గుర్తు చేశారు. మున్సిపల్, అంగన్‌వాడీ కార్మికుల సమస్యలపై, ఆర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ గతంలో సీపీఎం చేపట్టిన పోరాటానికి జేసీ ప్రభాకరరెడ్డి కూడా మద్దతు తెలియజేశారన్నారు. మరి ఆ రోజున తాము ఆయనతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యామా? అని ప్రశ్నించారు. ఏ రోజూ ఎవరితోనూ లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా... ప్రజాసమస్యల పరిష్కారానికి శాంతియుతంగానే పోరాటాలు సాగిస్తున్నామన్నారు. ఈ ఏడాది జనవరి 1న తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి నిర్వహించిన మహిళా ఈవెంట్ కార్యక్రమంపై, బస్సు తగలబెట్టడంపై, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేసిన దాడిపై మొదటిగా ఖండించింది సీపీఎం అని అన్నారు. నిజానిజాలను బట్టి ప్రజల పక్షాన సీపీఎం నిలుస్తోందన్నారు. చేసిన ఆరోపణలు నిరాధారమమని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభాకర్‌రెడ్డి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్య పాల్గొన్నారు.
సీపీఎం నాయకులు రాంభూపాల్, నల్లప్ప