హతవిధీ.. రక్తం ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

హతవిధీ.. రక్తం ఏదీ..?

May 4 2025 6:47 AM | Updated on May 4 2025 6:47 AM

హతవిధ

హతవిధీ.. రక్తం ఏదీ..?

అనంతపుం మెడికల్‌: ఉమ్మడి జిల్లాకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రే పెద్ద దిక్కు. నలుమూలల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా రక్త నిల్వలు లేకపోవడం కలవర పెడుతోంది. రోజూ 2,500 మంది ఔట్‌ పేషంట్‌, 1,100 మంది ఇన్‌పేషంట్లు సేవలు పొందుతుంటారు. వివిధ వార్డుల్లో ఉన్న రోగులకు సరాసరి 50 మంది వరకు రక్తం అవసరం ఉంటుంది. అందులో గర్భిణులు, బాలింతలు 20 మందికిపైగానే ఉంటున్నారు.

అందుబాటులో 163 యూనిట్లు

ప్రస్తుతం సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రంలో 163 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఏ పాజిటివ్‌ 22, బీ పాజిటివ్‌ 16, ఓ పాజిటివ్‌ 27, ఏబీ పాజిటివ్‌ 4, ఏ నెగిటివ్‌ 1, బీ నెగిటివ్‌ 7, ఓ నెగిటివ్‌ 7, ఏబీ నెగిటివ్‌ 1, ఇంకా ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సినవి 78 యూనిట్లు ఉన్నాయి.

సదుపాయాలు మృగ్యం..

సర్వజనాస్పత్రిలో రక్తనిధి (బ్లడ్‌ బ్యాంకు) నిర్వహణను ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్తనిధి కేంద్రంలో 12 ఏసీలు ఉన్నాయి. ఇందులో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. ఇక రక్తం నిల్వ ఉంచే ఫ్రీజర్‌ చెడిపోయి చాలా రోజులైంది. దీనిని మరమ్మతు చేయించి.. రక్తం నిల్వలు పెంచడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలంటే లెక్కలేదని తెలుస్తోంది.

మంత్రికి ప్రైవేట్‌పైనే ప్రీతి..

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఈ ఏడాది తన జన్మదినం రోజున ప్రభుత్వ సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రానికి మెడికల్‌ క్యాంపునకు అవకాశం కల్పించారు. అయితే రోజుల వ్యవధిలోనే క్యాంపును నగరంలోని దీపు రక్తనిధికి మళ్లించారు. ఎక్కడైనా సర్వజనాస్పత్రికి అధిక యూనిట్ల రక్తం అందించేలా చూడాల్సిన మంత్రివర్యులు.. ఇలా ప్రైవేట్‌ రక్తనిధికి సహకరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

కన్నెత్తి చూడని కలెక్టర్‌..

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఏనాడూ సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. పాతూరులోని రెడ్‌క్రాస్‌ను నాలుగైదు సార్లు పరిశీలించి, వారిని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఏనాడూ సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రాన్ని అభివృద్ధి చేసి.. అధిక మొత్తంలో రక్తం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. యువత ముందుచూపుతో రక్తం అందించడానికి ముందు వస్తే గర్భిణులు, బాలింతలు, క్షతగాత్రులకు ఉపయోగపడుతుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.

రక్తనిధిలో అందుబాటులో ఉన్నది 163 యూనిట్లే

సర్వజనాస్పత్రిలో రక్తం కొరత

రోజువారి అవసరం 50 యూనిట్లు

ఇక్కడ కనిపిస్తున్న గర్భిణి యాడికి చెందిన మహిళ. హెచ్‌బీ 8లోపే ఉండడంతో గైనిక్‌ వైద్యులు రెండు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. 2 గ్రాములు, 4 గ్రాములు, తదితర తక్కువ శాతంతో హెచ్‌బీ ఉన్న వారు చాలామంది ఆస్పత్రిలో అడ్మిషన్‌లో ఉన్నారు.

రాయదుర్గం ప్రాంతానికి చెందిన భంభం స్వామికి పొట్టేలు పొడవడంతో కాలుకు తీవ్ర రక్తస్రావమై శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు భంభం స్వామికి 10 యూనిట్ల రక్తం ఎక్కించారు.

అదేవిధంగా హిందూపురానికి చెందిన ఓ మహిళ గైనిక్‌ సమస్యతో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యింది. వైద్యులు రక్తం ఎక్కించుకోవాలని సూచించారు. అయితే ఆమెకు డోనర్‌ ఎవరూ లేరు. చివరకు బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు డోనర్‌ లేకున్నా..రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు.

హతవిధీ.. రక్తం ఏదీ..? 1
1/1

హతవిధీ.. రక్తం ఏదీ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement