
ఇళ్ల స్థలాల్లో ఇంత పెద్ద గుంతలా?
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం ఆలమూరు జగనన్నకాలనీ పక్కన ఉన్న ఎర్రకొండ చుట్టూ అక్రమ తవ్వకాలను చూసిన అధికారులు నివ్వెరపోయారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, చివరకు కరెంటు పోళ్లు, నీటి ట్యాంకుల చుట్టూ పెద్దపెద్ద గుంతల కారణంగా ప్రమాదకరంగా మారిన దృశ్యాలను చూసి విస్మయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రకొండ చుట్టూ యథేచ్ఛగా తవ్వకాలు జరిపిన వైనంపై ‘సాక్షి’లో శుక్రవారం ‘ఎర్రకొండపై ఎల్లో గద్దలు’ శీర్షికతో వచ్చిన కథనం కలకలం రేపింది. ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. భూగర్భ గనుల శాఖ డీడీ గంజి వెంకటేశ్వర్లు, అనంతపురం రూరల్ తహసీల్దార్ మోహన్‌కుమార్, ఆర్‌ఐ సందీప్, సర్వేయర్ రఘునాథ్ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పేదలకు ఇళ్ల కోసం కేటాయించిన స్థలాల్లోనూ పది అడుగులకు పైగా గుంతలు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించారు. తవ్వకాలతో ప్రమాదకరంగా మారిన కరెంటు పోళ్లు, నీటిట్యాంకులు వర్షాకాలంలో కూలే ప్రమాదం ఉందని తేల్చారు. హౌసింగ్ పీడీ శైలజకు గనుల శాఖ డీడీ వెంకటేశ్వర్లు ఫోన్‌లో మాట్లాడారు. మీరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున గుంతలు పెట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగగా... అదంతా రెవెన్యూ వాళ్లు చూసుకోవాలి కదా అని పీడీ పేర్కొన్నారు. రెవెన్యూ వాళ్లు స్థలాన్ని హౌసింగ్ అధికారులకు అప్పగించారు. హౌసింగ్ వారే ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. కరెంటు పోళ్లు నాటించారు. నీటి ట్యాంకులు ఏర్పాటు చేయించారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించకుండా ఇలా గాలికొదిలేస్తే ఎలా అని డీడీ ప్రశ్నించారు. కచ్చితంగా ఒకరిద్దరిని ఇక్కడ ఏర్పాటు చేసి తవ్వకాలు జరగకుండా చూడాలన్నారు. వెంటనే ఇద్దరు ఉద్యోగులను ఏర్పాటు చేస్తామని హౌసింగ్ పీడీ పేర్కొన్నారు. వీఆర్‌ఏ కూడా రోజూ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని, ఎవరైనా తవ్వకాలు జరిపినా, జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లు ఈ ప్రాంతానికి వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరిపితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
ఎర్రకొండలో అక్రమ తవ్వకాలు
పరిశీలనలో అధికారుల విస్మయం
హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యంపై
భూగర్భ గనుల డీడీ ఆగ్రహం

ఇళ్ల స్థలాల్లో ఇంత పెద్ద గుంతలా?