రేపు బీకేఎస్‌లో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

రేపు బీకేఎస్‌లో పరిష్కార వేదిక

May 4 2025 6:47 AM | Updated on May 4 2025 6:47 AM

రేపు బీకేఎస్‌లో  పరిష్కార వేదిక

రేపు బీకేఎస్‌లో పరిష్కార వేదిక

అనంతపురం అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుక్కరాయసముద్రం సమీపంలోని షిరిడీసాయి కళ్యాణ మండపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తనతో పాటు జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌ఓ, జిల్లా అధికారులందరూ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రెచ్చిపోయిన జేసీ

సీపీఎం నేత రాంభూపాల్‌పై

అనుచిత వ్యాఖ్యలు

తాడిపత్రిటౌన్‌ : తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. సీపీఎం రాష్ట్ర నేత రాంభూపాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాన్ని చెప్పడమే నేరమన్నట్లుగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉన్నా జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. ఈ అంశంపై ‘సాక్షి’ టీవీ డిబేట్‌లో రాంభూపాల్‌ మాట్లాడడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం తాడిపత్రిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ..తనదైన రీతిలో రెచ్చిపోయారు. ‘స్కూల్‌ గ్రౌండ్‌లో టిప్పర్లతో రాళ్లు వేశామని మాట్లాడుతున్నావ్‌.. మాజీ ఎమ్మెల్యేను ఎందుకు వెనుకేసుకొస్తున్నావ్‌? ఏమైనా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నావా? గత ఐదేళ్లు ఎక్కడికి పోయింటివి రాంభూపాల్‌.. ఆరోజు నన్ను పోలీసోళ్లు ముసలోడినని కూడా చూడకుండా ఎలా తోశారో చూడలేదా? నాకు నీ మీద మంచి అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో నీకు మర్యాద పోయింది. నీ గురించి కూడా తీస్తా. విత్‌ రికార్డ్‌తో వస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

రైతుల ఆశలు గాలికి

గాలీవానకు రూ.2 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం అగ్రికల్చర్‌: రైతుల ఆశలు గాలికి పోతున్నాయి. ఈ సీజన్‌లో నెలన్నర రోజులుగా గాలీవాన బీభత్సానికి పెద్ద ఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. చేతికొచ్చిన పంటల వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లుతోంది. తాజాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు మండలాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో పంటలు నేలవాలాయి. గాలులకు తోడుగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం వల్ల రైతులకు కోలుకోని నష్టం కలిగించింది. ఉద్యానశాఖ అంచనా మేరకు గుంతకల్లు, గుమ్మఘట్ట, అనంతపురం, రాప్తాడు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, యల్లనూరు మండలాల్లో 31 గ్రామాల పరిధిలో అరటి, బొప్పాయి, మామిడి పంటలు 88.61 హెక్టార్లలో దెబ్బతినడంతో 102 మంది రైతులకు రూ.1.64 కోట్ల వరకు నష్టం జరిగింది. అలాగే శింగనమల మండలంలో మొక్కజొన్న, వరి పంటలు 44 హెక్టార్లలో నేలవాలడంతో 77 మంది రైతులకు రూ.38 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నెలన్నర రోజులుగా జిల్లా రైతులకు రూ.70 కోట్లకు పైగా పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.

23 మండలాల్లో వర్షం..

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 6.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.

సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం: సెల్‌ఫోన్‌ను పక్కనపెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వన్‌టౌన్‌ సీఐ వి.రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్నానగర్‌కు చెందిన కల్లూరు చంద్రకాంత్‌ (20) ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చంద్రకాంత్‌ కళాశాలకు వెళ్లకుండా తరచూ సెల్‌ఫోన్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన చంద్రకాంత్‌ శనివారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కల్లూరు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement