
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ నాటికి పరీక్షలు ముగుస్తాయి. తొలి రోజున అభ్యర్థుల హాజరు 65 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ బాలజీ పీజీ కళాశాల కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 594 మంది అభ్యర్థులకు గాను 389 మంది హాజరయ్యారు. 205 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక సదుపాయల కల్పనపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సదుపాయంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏపీఎస్‌సీ నియమ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, లైజన్ అధికారి ఎస్‌డీసీ తిప్పేనాయక్, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు.
తొలి రోజున అభ్యర్థుల హాజరు 65 శాతం