
● అనారోగ్యం బారిన అధికారులు, ఉద్యోగులు ● డెప్యుటేషన్‌లో
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, పంట రకాలు, విస్తీర్ణం, దిగుబడులు, టర్నోవర్ పరంగా ‘అనంత’ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 72 రకాల పంటలతో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగానూ, ఫలసాయం, ఎగుమతుల పరంగా ఇటీవల ఉద్యాన హబ్‌గా పిలవబడుతోంది. జిల్లాలో 3 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉద్యాన తోటలు విస్తరించాయి. అందులో 1.80 లక్షల ఎకరాలు పండ్లతోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, మిగతా 45 వేల ఎకరాల్లో పూలు, ఔషధ, సుగంధ, తోట పంటలు సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల ఫలసాయం వస్తుండగా... రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల మేర టర్నోవర్ (జీవీఏ) ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘అనంత’ ఫలసాయానికి ఢిల్లీలో ఉన్న అజాద్‌పూర్ మండీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంటోంది. అలాగే హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, విజయవాడ, నాగపూర్ లాంటి మార్కెట్లకు చీనీ, దానిమ్మ, మామిడి, అరటి, టమాట, కళింగర, కర్భూజా లాంటి ఫలసాయం ఎగుమతి అవుతోంది.
ఏడీ స్థాయి అధికారే దిక్కు..
ఉద్యానతోటల పరంగా ప్రాధాన్యత కలిగిన ‘అనంత’కు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ (డీడీహెచ్) స్థాయి అధికారి లేకపోవడం గమనార్హం. ఇక్కడే వేతనం తీసుకుంటూ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి కమిషనరేట్‌లో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారితో నెట్టుకొస్తున్నారు. ఏడీకి అదనంగా ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈఓగా బాధ్యతలు ఇచ్చారు. ఇక 31 మండలాల పరిధిలో 10 మంది హార్టికల్చర్ ఆఫీసర్లు(హెచ్‌ఓ)లు, మరో నలుగురు హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు(హెచ్‌ఈఓ) ఉన్నారు. ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లుగా మరో 180 మంది వరకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ (వీహెచ్‌ఏ)లు పనిచేస్తున్నా. వీరు పూర్తీ స్థాయిలో హార్టికల్చర్ కింద పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యాన పథకాలతో పాటు ఏపీఎంఐపీ కింద అమలు చేస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్ల పథకంలో కూడా ఉద్యానశాఖ అధికారులు భాగస్వామ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యానశాఖ మీద పనిఒత్తిడి పెరిగినట్లు చెబుతున్నారు.
నిత్యం సమావేశాలే..
తరచూ కమిషనరేట్, కలెక్టరేట్ నుంచి నివేదికలు కోరడం, నిత్యం జూమ్, వెబ్ కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు అధికం కావడం, క్యాంప్‌లు ఉండటం తదితర కారణాలతో ఒత్తిడి అధికమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లవాన, చీడపీడల తాకిడికి పంటలు దెబ్బతినడం, సస్యరక్షణ సిఫారసులు చేయడం, పంట నష్టం అంచనా వేయడం లాంటి వాటితో పాటు ఇటీవల కాలంలో పథకాల అమలులో అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఆ శాఖ అధికారులు అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుస్తోంది. ఏడీ స్థాయి అధికారి నరసింహారావు రెండు సార్లు నెల రోజుల పాటు సెలవు పెట్టారు. ప్రధానంగా గంట గంటకు పై నుంచి నివేదికలు, సమాచారం అడగడం వల్ల సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో ఈదురుగాలులతో పంటలు దెబ్బతిన్న సమయంలో పుట్లూరు మండలానికి చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడటంతో అధికార పార్టీ నేతలు, కమిషనరేట్, కలెక్టరేట్ నుంచి ఒత్తిళ్లు రావడంతో ఏడీ నరసింహారావు గుండెనొప్పితో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని అనంతరం నెల రోజుల పాటు సెలవు పెట్టారు. అలాగే హెచ్‌ఓ రత్నకుమార్ సైతం గుండెనొప్పితో ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కార్యాలయ సూపరిండెండెంట్ బాషా సైతం గుండెనొప్పితో ఇటీవల స్టంట్ వేయించుకున్నారు. మరో సూపరిండెండెంట్ శాంతకుమారి తీవ్ర వెన్నునొప్పితో ఆపరేషన్ చేయించుకున్నారు. అకౌంటెంట్ కమలాకర్ కంటి నొప్పి భరించలేక వారం కింద లేజర్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇలా... ఉద్యానశాఖ అధికారులు, ఉద్యోగులు ఇటీవల ఒత్తిడికి గురవుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

● అనారోగ్యం బారిన అధికారులు, ఉద్యోగులు ● డెప్యుటేషన్‌లో