నల్ల్లలమ్మ ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

నల్ల్లలమ్మ ఆలయంలో చోరీ

May 4 2025 6:16 AM | Updated on May 8 2025 1:49 PM

రాప్తాడు: బుక్కచెర్ల ఎస్సీ కాలనీలోని నల్ల్లలమ్మ ఆలయంలో అమ్మవారి సోత్తులు చోరీకి గురయ్యాయి. ఆలయ నిర్వాహకులు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలు.. ఆలయ పూజారి నల్లప్ప అమ్మవారికి ప్రతి మంగళ, శుక్ర, ఆదివారం పూజలు చేస్తుండేవారు. శుక్రవారం పూజలు చేసి ఆలయానికి తలుపులు వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి 80 గ్రాముల అమ్మవారి ముఖావళి, 20 గ్రాముల 3 వెండి గొడుగులు, ఒక తులం బంగారు తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. రూ.2 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.

ఆర్టీసీ బస్సులో రూ. 70 వేలు చోరీ

గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులో ఉన్న ప్రయాణికుడి నుంచి రూ.70 వేలు చోరీకి గురయ్యాయి. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన తాయప్ప రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని స్వస్థత శాలకు వచ్చాడు. శనివారం సాయంత్రం రాయచూరు వెళ్లడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాడు. ఈక్రమంలో ఆళ్లగడ్డ బస్సు ఎక్కగా పది నిమిషాల్లోనే తన వద్ద ఉన్న రూ.70 వేలు కనిపించలేదు. దీంతో బస్సంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బస్సును స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి

అనంతపురం: మద్యం మత్తులో స్నేహితుడిపై దాడిపై దాడి చేసిన ఘటన శారదనగర్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ వి. రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తెలిపిన వివరాలు..ఫెర్రర్‌ నగర్‌కు చెందిన మునాఫ్‌, శారదానగర్‌కు చెందిన మురళి మిత్రులు. మద్యం సేవించిన అనంతరం మాటామాట పెరిగింది. వ్యక్తిగతంగా దూషించుకున్నారు. స్థానికులు సర్దిచెప్పి పంపించేశారు. దూషించాడనే అవమానంతో దూషించిన మురళి నాటు కొడవలి, దుస్తులు శుభ్రం చేసే సోడా రసాయన ద్రావణం, తీసుకుని తిరిగి మద్యం షాపు వద్దకు వచ్చాడు. శారదనగర్‌లో మద్యం షాపు వద్ద మద్యం సేవిస్తున్న మునాఫ్‌పై ద్రావణం చల్లాడు. రాయి, కొడవలితో దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ మునాఫ్‌ను ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. బాధితుడి కళ్లు, ముఖం, శరీర భాగాలు దెబ్బన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు మురళిని అదుపులోకి తీసుకున్నారు.

రేపు ఆర్ట్స్‌ కళాశాలలో మెగా ఉద్యోగమేళా

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో సోమవారం మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ పి. పద్మశ్రీ, జేకేసీ సమన్వయకర్త తాళంకి జీవన్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలు డాక్టర్‌ రెడ్డి ఫౌండేషన్‌, కియా, అమెజాన్‌, జోయలుక్కాస్‌ తదితర సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆయా కంపెనీల్లో సుమారు 1000 పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తయిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బంగారం మూట మాయం అతడి పనే..
పెన్నహోబిళం ఘటనలో స్వీపరే నిందితుడు
సీసీ పుటేజీ ఆధారంగా గుర్తింపు

ఉరవకొండ: ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనృసింహస్వామికి భక్తురాలు సమర్పించిన బంగారు మూటను మాయం చేసిందే స్వీపరేనని పోలీసులు గుర్తించారు. శనివారం అర్బన్‌ సీఐ మహానంది వివరాలు వెల్లడించారు. మార్చి 7న ఆమిద్యాల గ్రామానికి చెందిన వనజాక్షి అనే భక్తురాలు మొక్కులో భాగంగా నిలువుదోపిడీ కింద బంగారు మూటను స్వామి వారికి సమర్పించింది.ఈఏడాది మార్చి 18న పెన్నహోబిళం శ్రీవారి హుండీ లెక్కింపు సమయంలో స్వీపర్‌ శ్రీనివాసులు వనజాక్షి సమర్పించిన బంగారు మూటను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టి మూట కనబడలేదని అధికారులను తప్పుదోవ పెట్టించాడు. 

వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో భయపడిన స్వీపర్‌ తాను చెత్త ఊడుస్తున్న సమయంలో బంగారు మూట దొరికిందని చెప్పి అధికారులు అప్పగించారు. అయితే ఈ ఘటనపై ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా స్వీపర్‌ బంగారు మూటను మాయం చేసేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement