గుత్తి డీవైఈఓగా పాటిల్ మల్లారెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్/ గుత్తి: గత కొంత కాలంగా నాన్చుతూ వచ్చిన గుత్తి డీవైఈఓ పోస్టుపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. బెళుగుప్ప ఎంఈఓ పాటిల్ మల్లారెడ్డి(ఎఫ్‌ఏసీ)ని నియమిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు 4 రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ రెగ్యులర్ డీవైఈఓగా పని చేస్తున్న శ్రీదేవి ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి డీఈఓనే ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. నూతన డీవైఈఓ మల్లారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. పలువురు ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా విద్యాశాఖలోని ఓ విభాగంలో కీలకమైన పోస్టులో పని చేసిన అధికారిపై ఆర్థిక అంశాలపై ఆరోపణలు వచ్చాయి. గతంతో పని చేసిన డీఈఓ వరలక్ష్మి...ఇక్కడ చేరకముందే ఆమె పేరుతో ప్రశ్నపత్రాల ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఆ తర్వాత బిల్లులు డ్రా చేయడం తదితర అంశాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా సదరు అధికారిపై చార్జ్ మెమోలు జారీ చేశారు. వాస్తవానికి ఈ అధికారే సీనియార్టీ జాబితాలో ముందున్నారు. అయితే చార్జెస్ పెండింగ్ ఉన్న కారణంగా...ఆయనకు ఇవ్వడానికి వీలులేదని తేల్చిన ఉన్నతాధికారులు మల్లారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కోసం విద్యాశాఖలోని మరో కీలక అధికారి చివరివరకు తీవ్రంగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి చెక్ పెట్టిన ఉన్నతాధికారులు


