
ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
● డిప్యూటీ తహసీల్దార్
ఇంతియాజ్‌కు గాయాలు
కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ అన్షర్‌బాషాతో కలిసి శనివారం ఉదయం అనంతపురం నుంచి పెనుగొండ వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న మరో కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని ఇటువైపు వెళ్తున్న వీరి కారును ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీటీ ఇంతియాజ్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ అన్షర్‌బాషా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
గార్లదిన్నె: మండలంలోని మర్తాడుకు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సైదాబీ(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో మదనపడుతుండేది. ఈక్రమంలో అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.