పరిష్కారం చూపకపోతే సమ్మె తప్పదు
● ఎన్‌ఎంయూ హెచ్చరిక
అనంతపురం క్రైం: ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే సమ్మె తప్పదని ప్రభుత్వాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు హెచ్చరించారు. డిమాండ్ల సాదనలో భాగంగా సోమవారం ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో అనంతపురం డిపో ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు భధ్రత కల్పిస్తూ 1–2009 విడుదల చేసిన సర్కులర్‌ని అన్ని డిపోల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కింది స్థాయి ఉద్యోగులు, కార్మికులపై అధికారులు కక్షపూరితంగా వేటు వేస్తున్నారని, తక్షణమే అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలన్నారు. తక్షణం పదోన్నతులు కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ, సెలవులు మంజూరు చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని అమలు చేయాలన్నారు. నైట్ సిఫ్ట్ అలవెన్సులను రూ.150 నుంచి 114 జీఓలో పొందుపరిచిన మేరకు రూ.400కు పెంచాలన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షల్లో డ్రైవరు మద్దిలేటి, కేకే రావు, శ్రీనివాసులు, శ్రీనివాసులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
హౌస్ వైరింగ్‌పై
‘రూడ్‌సెట్’లో ఉచిత శిక్షణ
అనంతపురం: ఎస్కేయూ సమీపంలోని రూడ్‌సెట్ సంస్థలో మే 6 నుంచి జూన్ 4వ తేదీ వరకూ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై నిరుద్యోగ యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు అర్హులు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుంది. పూర్తి వివరాలకు 94925 83434లో సంప్రదించవచ్చు.


