
బాధితులకు ఇదేనా మీరు చేసే న్యాయం?
అనంతపురం అర్బన్: ‘మీకు ఎస్సీ, ఎస్టీలన్నా, వారి సమస్యలన్నా చిన్న చూపు. బాధితుల సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపరు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదు’ అంటూ అధికారులను సంఘాల నాయకులు నిలదీశారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌తో పాటు జిల్లా ఎస్పీ పి.జగదీష్, డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, సాంఘిక సంక్షేమశాఖాధికారి రాధిక, అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 238 అర్జీలు అందాయి. ఒక బాధితురాలికి న్యాయం చేసే విషయంలో డీఆర్‌ఓతో ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా వీరా వాగ్వాదానికి దిగారు. నగర పరిధిలో నివాసముంటున్న ఎరికల కులానికి చెందిన మహిళ సామూహిక అత్యాచారానికి గురైందన్నారు. అప్పట్లో పోరాటం చేస్తే రూ. లక్ష ఆర్థిక సాయం అందించారన్నారు. జీఓ 95 ప్రకారం బాధితురాలికి ఐదు సెంట్ల స్థలం ఇవ్వాల్సి ఉందని, తొమ్మిదేళ్లుగా అర్జీలిస్తున్నా బాధితురాలికి న్యాయం చేయలేద న్నారు. ఈ విషయంలో ఆర్‌డీఓ, తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానన్నారు.
వినతుల్లో కొన్ని...
● తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారంటూ కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం ఎస్టీ కాలనీకి చెందిన వాలేనాయక్ ఫిర్యాదు చేశాడు. కంబదూరు మండలం పాలూరు గ్రామ పొలం సర్వే నంబరు 80–1లో 3.50 ఎకరాల భూమి తన తల్లి పేరిట ఉందని, ఈ భూమిని గ్రామంలోని ఒక వ్యక్తి, తహసీల్దారు కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు కలిసి ఆక్రమించారని తెలిపారు. దీనిపై ఆర్‌డీఓ, తహసీల్దారు, పోలీసులు భూమి హద్దులు వేసినా ఆక్రమణ దారులు తొలగించారని, భూమిలోకి వస్తే చంపుతామంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు.
● 20 నెలలుగా తనకు వేతనం అందడం లేదంటూ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి సూర్యనారాయణ విన్నవించాడు. డ్యూటీపై ఎక్కడా తిరగనివ్వడం లేదని, ఆఫీసులో కూర్చోబెడుతున్నారని వాపోయాడు.
● రుణానికి సంబంధించి సబ్సిడీ మంజూరులో అధికారులు జాప్యం చేస్తున్నారని యల్లనూరు మండలం పాతపల్లికి చెందిన పి.విజయ ఫిర్యాదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైందని, అయితే సబ్సిడీ మంజూరు క్రమంలో ఫైల్‌ను బ్యాంకుకు పంపకుండా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అధికారులను నిలదీసిన
ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు
ప్రత్యేక గ్రీవెన్స్‌లో 238 వినతులు
భద్రతా ప్రమాణాలు పాటించాలి
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆరు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
జిల్లా మినరల్ ఫండ్ ద్వారా తాగునీరు, విద్య, వైద్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ యోజన (పీఎంకేకేకేవై)పై గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, జేసీ అస్మిత్‌రెడ్డి, దగ్గుపాటి ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 31 నాటికి రూ.52.66 కోట్ల నిధులు నూతన పనులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో నియోజకవర్గానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనులు మంజూరు చేసేందుకు కమిటీ ప్రతిపాదన చేసిందని చెప్పారు. సమావేశంలో గనుల శాఖ డీడీ వెంకటేశ్వర్లు, తాడిపత్రి ఏడీ ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.