
క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే
అనంతపురం కల్చరల్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
నేనే మార్గం – నేనే జీవం
పాపులను పరిశుద్ధులను చేసేందుకు కరుణామయుడైన క్రీస్తు సిలువనెక్కిన రోజున గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నట్లు పలువురు పాస్టర్లు తమ సందేశాలలో చెపుతున్నారు. నేనే మార్గం.. నేనే జీవం అని సమస్త మానవాళిలో స్థైర్యం నింపుతూ యేసయ్య చిరునవ్వుతో తన దేహాన్ని బలిదానంగా అర్పించిన రోజు శుభ శుక్రవారంగా మారిందని, ఉపవాసాలతోనే ఆయనను మెప్పించాలని పేర్కొన్నారు.
ముస్తాబైన చర్చిలు
సాధారణంగా ఇతర పండుగలకు భిన్నంగా గుడ్‌ఫ్రైడే ఆనందోత్సాహాలతో కాకుండా క్రీస్తు త్యాగానికి ప్రతీకగా కనపడుతుంది. కాబట్టే ఈ దినాల నాడు ఉపవాసాలుండడం ఆనవాయితీగా వస్తోంది. క్రీస్తు చివరిసారి సిలువపై పలికిన ఏడు వ్యాక్యాలు ప్రార్థనామందిరాలలో ఇప్పటికే ప్రతిధ్వనిస్తున్నాయి. అనంతలోని పురాతన మందిరాలైన సీఎస్‌ఐ చర్చిలో పెద్ద ఎత్తున క్రైస్తవులతో రెవరెండ్ బెనహర్‌బాబు నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో ప్రాచీన ప్రార్థనామందిం ఎస్‌ఐయూ చర్చిలో బెంగళూరు నుంచి విచ్చేసే అంతర్జాతీయ సువార్తీకులు స్టీఫెన్ బాబ్, సంఘ కాపరి పాస్టర్ సంపత్‌కుమార్‌తో కలసి వల్యక్యోపదేశం చేయనున్నారు. రామచంద్ర నగర్‌లోని కార్మియల్ మాత మందిరంలో క్రీస్తు జీవితాన్ని సజీవంగా ఆవిష్కరించే లఘు నాటికను ప్రదర్శించనున్నారు. కోర్టురోడ్డు, గుల్జార్‌పేట్‌లోని గాస్పెల్ హాల్, కళాకారుల కాలనీలోని రేమా చర్చి సామూహిక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. క్రీస్తు సిలువపై పలికిన చివరి మాటల ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనల్లో విరివిగా పాల్గొనాలని పాస్టర్లు పిలుపునిచ్చారు.
సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న చర్చిలు
ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు

క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే