
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
● చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు
● జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో ఈ నెల 27న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.వెంకటసుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సీఈఓ చాంబర్‌లో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొద్దం, గాండ్లపెంట, రామగిరి, కణేకల్లు, కంబ దూరు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు,ఉరవ కొండ, పెద్దపప్పూరు, యల్లనూరు, రాయదుర్గం మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఎన్నుకునే హక్కు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల కో–ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ ఉండదన్నారు. మెజారిటీ సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ఎన్నికవుతారన్నారు. ఎన్నికల రోజున బందోబస్తు కూడా ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందనే విషయాన్ని ముందుగా చాటింపు వేయించాలని ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారులు ఖుష్బూ కొఠారి(ఉరవకొండ), జి,భార్గవ్(కణేకల్లు), మద్దిలేటి(కంబదూరు), రఘునాథరెడ్డి(యల్లనూరు), ప్రభాకర్‌రెడ్డి(పెద్దపప్పూరు), శ్రీనివాసయాదవ్ (రాయదుర్గం), సుదర్శన్(గాండ్లపెంట),విజయప్రసాద్ (రొద్దం), సంజీవయ్య(రామగిరి), ఎన్నికల విభాగం అధికారులు ధనుంజయ, ఖలందర్ పాల్గొన్నారు.