అనంతపురం అగ్రికల్చర్: వంకాయ పంటలో ఆశించే నులిపురుగులు (నెమటోడ్స్) మీద జన్యు, మాలుక్యూలర్ పరిశోధనలకు గానూ రాప్తాడు మండలం పెసరకుంట గ్రామానికి చెందిన రైతు శివయ్య కుమారుడు గుజ్జల నారాయణస్వామికి ప్రతిష్టాత్మక ‘ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్)’డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ 63వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉద్యాన విభాగంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ అందుకున్న నారాయణస్వామిని గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.
విద్యార్థిని అదృశ్యం
బత్తలపల్లి: సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలోని పీవీకేకేలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సెలవుల నేపథ్యంలో గత వారం రోజులుగా ఇంటి పట్టునే ఉన్న ఆమె శనివారం తన ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకుని, సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కళాశాలలో సైతం విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో తన కుమార్తె కనిపించడం లేదంటూ బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు.
ఇరువర్గాల ఘర్షణ –
నలుగురికి తీవ్ర గాయాలు
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో నలుగురు యువకులు గాయపడ్డారు. వివరాలు.. గుత్తికి చెందిన రాము, యోగి మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని కత్తులు, కట్టెలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఘటనలో రాము, ఆంజనేయులు అలియాస్ అదుర్స్, గణేష్ అలియాస్ ఘని, ఆంజనేయులు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాము, ఆంజనేయులును అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నారాయణస్వామికి ‘ఐసీఏఆర్’ డాక్టరేట్