● ఇతని పేరు టి.గోవిందప్ప. కుందుర్పి మండలం మహంతపురం గ్రామం. 2017 సంవత్సరంలో కుందుర్పి కెనరా బ్యాంక్‌లో రూ.12 వేల పంట రుణం తీసుకున్నాడు. 2020లో రుణం మొత్తం వడ్డీతో కలిపి చెల్లించాడు. కానీ, ఐదేళ్లవుతున్నా ఇప్పటికీ పాసుపుస్తకం ఇవ్వలేదు. ఇదేమని ప్రశ్నిస్తే... ‘నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో ఇవ్వను’ అంటూ మేనేజర్ దురుసుగా మాట్లాడుతున్నాడు. దీంతో సమస్యను కలెక్టర్‌కు చెప్పుకునేందుకు గోవిందప్ప సోమవారం కలెక్టరేట్‌కు వచ్చాడు.
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రజల నుంచి జేసీ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి,ఆనంద్,రమేష్‌రెడ్డి,తిప్పేనాయక్‌లు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 419 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి నివేదికలు త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని..
● వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లవుతున్నా ట్రాన్స్‌ఫార్మర్ వైరు ఇవ్వలేదని గుంతకల్లు మండలం కొంగనపల్లికి చెందిన పి.రంగన్న ఫిర్యాదు చేశాడు. పరిష్కారం చూపాలని కోరాడు.
● పింఛను మంజూరు చేయాలంటూ కళ్యాణదుర్గం మారెంపల్లి కాలనీకి చెందిన షేక్ చాంద్‌బీబీ విన్నవించింది. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారని, పనిచేయడానికి కూడా ఆరోగ్యం సహకరించని తనకు పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కోరింది.
● తమకు చెందాల్సిన భూమిని వేరొకరి పేరున పాసుపుస్తకాలు ఇచ్చారని అనంతపురం రామ్‌నగర్‌కు చెందిన పి.రామచంద్ర ఫిర్యాదు చేశాడు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామ పొలం సర్వే నంబరు 116లో 1.03 ఎకరాల భూమి తండ్రి ద్వారా తమకు చెందాల్సి ఉన్నా.. ఇతరుల పేరున పాసు పుస్తకాలు ఇచ్చారన్నాడు. న్యాయం చేయాలని కోరాడు.
పరిష్కార వేదిక కిటకిట