అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటసత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘ఆపస్’ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటసత్యనారాయణ మాట్లాడుతూ... 2023లోనే వేతన సవరణ చేయాల్సి ఉన్నా నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని దాదాపు 9 నెలలు వేచి ఉన్నా... కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలని, మోడల్ పాఠశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రాథమిక పాఠశాల మూసివేతకు కారణం కాకూడదని, 2022 నుంచి చెల్లించాల్సిన జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్, సరెండర్ లీవ్, సీపీఎస్‌కు సంబంధించిన 90 శాతం డీఏ అరియర్స్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ‘ఆపస్’ రాష్ట్ర గౌరవ సలహాదారు వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు హర్షవర్ధన్, పీఎస్వీ నాయుడు, జిల్లా కార్యదర్శి ఆదిశేషు, రమేష్, చిక్కీరప్ప, వరదరాజులు పాల్గొన్నారు.