
ప్రభుత్వం ఆదుకోవాలి
అనంతపురం అగ్రికల్చర్/శింగనమల/యల్లనూరు/ పుట్లూరు: ఈదురుగాలులు ఉద్యాన రైతులకు శోకం మిగిల్చాయి. శనివారం సాయంత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి తదితర మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.ఎల్లుట్ల, మడ్డిపల్లి, కుమ్మనమల, దోసలేడు, నిదనవాడ, దిమ్మగుడి చెర్లోపల్లి, ఎస్.కొత్తపల్లి, మేడికుర్తి, చింతకాయమండ, అరవేడు, వెన్నపూసపల్లి, నీర్జాంపల్లి, తిమ్మంపల్లి, కూచివారిపల్లి, కొడవాండ్లపల్లి, గొడ్డుమర్రి, శింగవరం, బొప్పేపల్లి, బుక్కాపురం, లక్ష్ముంపల్లి, చందన తదితర గ్రామాల్లో 560 హెక్టార్లలో అరటి తోటలు నేలవాలాయి. శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి తోటలో మామిడి కాయలు నేలరాలాయి. కృష్ణారెడ్డి, పరంధామ రెడ్డిల దానిమ్మ తోటల్లో చెట్లు నేలకొరిగాయి. లక్ష్మీనారాయణరెడ్డి, చిన్న శివారెడ్డి సాగు చేసిన మునగ పంటతో పాటు శ్రీనివాసులు రెడ్డికి చెందిన సపోట పంట తీవ్రంగా దెబ్బతింది. ఎల్లుట్లలో రైతు మారుతీనాయుడుకు చెందిన 1,000 అరటిచెట్లు విరిగిపోయాయి. 7 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. దిగుబడి చేతకందే తరుణంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
రూ.35.22 కోట్ల నష్టం..
దెబ్బతిన్న పంట పొలాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు పరిశీలించారు. 406 మంది ఉద్యాన రైతులకు రూ.34.91 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు నరసింహారావు తెలిపారు. అలాగే, 47 మందికి చెందిన 35 హెక్టార్ల మొక్కజొన్న దెబ్బతినడంతో రూ.31 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
పుట్లూరు మండలం జంగంరెడ్డిపేటలో దెబ్బతిన్న అరటి తోటను చూపుతున్న రైతు మహేశ్వరరెడ్డి
వర్ష
సూచన..
కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా రాగల రెండు రోజులు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో విస్తరించిన ఉపరితల ద్రోణి వల్ల ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడొచ్చన్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే సూచన ఉందన్నారు.
గాలీవానకు తోటలో దానిమ్మ చెట్లు ఒరిగిపో యాయి. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. మా గ్రామంలో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే అన్నదాతలు అప్పులపాలవడం ఖాయం. – పరంధామ రెడ్డి,
ఉల్లికల్లు, శింగనమల మండలం

ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వం ఆదుకోవాలి