రాయదురంటౌన్: ముందస్తు అడ్మిషన్లతో పాటు విద్యా సంవత్సరం పూర్తి కాకనే 9వ తరగతి విద్యార్థులకు టెన్త్ సిలబస్ బోధిస్తున్న నారాయణ విద్యా సంస్థను తక్షణమే సీజ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈఓ నాగమణికి ఫిర్యాదు చేయడంతో గురువారం ఆమె క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఆమె వెంట విద్యార్థి సంఘాల నాయకులు బంగి శివ, ఆంజనేయులు, కార్తీక్, వలి, నవీన్, మహబూబ్‌బాషా ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులతో ఎంఈఓ మాట్లాడారు. నిబంధనలు ఉల్లఘించి పుస్తకాలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని సీజ్ చేశారు. జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా, ఆ కళాశాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎంత మాత్రం చలనం లేదని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నారాయణ విద్యాసంస్థలను మూసేయాలని డిమాండ్ చేశారు.
యువకుడి ఆత్మహత్య
అనంతపురం సిటీ: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని అశోక్‌నగర్ రెండో క్రాస్‌లో నివాసముంటున్న అమ్మినేని వెంకటనాయుడు, రమాదేవి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు తరుణ్‌కుమార్(28) ఉన్నారు. కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అహమ్మదాబాద్‌లో పనిచేస్తున్నారు. తరుణ్‌కుమార్ ఎంబీఏ చదువుతూ మధ్యలోనే ఆపేసి, ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన అవకాశాలు దక్కలేదు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. చివరకు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలంటూ తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మద్యానికి అవసరమైన డబ్బు కోసం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినా తరుణ్‌కుమార్... నేరుగా మారుతీనగర్ సమీపంలోని రైలు పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంకటనాయుడు, రమాదేవి అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతుడిని తరుణ్‌కుమార్‌గా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.